ఇది ఎల్లోనినో ఎఫెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇది ఎల్లోనినో ఎఫెక్ట్‌

Sep 19 2026 5:50 AM | Updated on Sep 19 2026 5:50 AM

● ప్రకృతి వైపరీత్య వేళ చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం ● కరువు సమయంలో రైతులను ఆదుకునే ప్రయత్నం శూన్యం ● ఉన్న నీటిని సక్రమంగా వినియోగించడంలోనూ విఫలం ● తక్షణమే రైతులను, ప్రజలను ఆదుకోవాలి ● మాచర్లలో మీడియా సమావేశంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

సాక్షి, నరసరావుపేట: ఎల్‌నినో వల్ల వచ్చిన కరువు సమయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకం వల్ల దాని తీవ్రత మరింత పెరిగి ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని, ఇది పూర్తిగా సర్కారు వైఫల్యమని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. మాచర్లలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇది ఎల్‌నినో ఎఫెక్ట్‌ కాదని, ఎల్లోనినో ఎఫెక్ట్‌ అని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత వల్ల ముఖ్యంగా పల్నాడు జిల్లా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. పంటల పరిస్థితులు చూస్తే 1,57,900 హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉండగా, ప్రస్తుతానికి కనీసం 50 శాతం కూడా పూర్తికాని దుస్థితి నెలకొందన్నారు. వెంటనే జిల్లాలోని 28 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని తెలిపారు. రైతులను ఆదుకోవాల్సి వస్తుందన్న కారణంతోనే కావాలనే కరువు మండలాల ప్రకటన చేయకుండా వారిని మోసం చేస్తున్నారన్నారు. అదే పక్కన కర్ణాటక ఆగస్టు 28వ తేదీనే కరువు ప్రాంతాలను ప్రకటించిందని గుర్తుచేశారు. అలా చేసి ఉంటే రుణాలన్నీ రీషెడ్యూల్‌ అవుతాయి, క్రాప్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్స్‌ రావడంతో రైతులకు కొంతమేర ఉపశమనం లభించేదన్నారు. కాకపోతే మన దగ్గర చంద్రబాబు పుణ్యమా అని ఆ అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో చంద్రబాబు కరువు మండలాలు ప్రకటించలేదన్నారు.

సాగునీరు అందించలేకపోయారు...

కృష్ణానదిపై ఉన్న జలాశయాల్లో ఉన్న అరకొర నీటిని సక్రమంగా వినియోగించి రైతులకు ఆరు తడులకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో నీటిని వృథా చేసిందన్నారు. దీంతో రైతులు సాగు చేయలేకపోయారని, చేసిన వారు నిండా మునిగిపోయారన్నారు. మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లాకు ఎంతో కీలకమైన పులిచింతల ఎగువ, దిగువన తెలంగాణలో లిఫ్ట్‌లు అక్రమంగా కడుతున్నా చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. రైతుల కోసం చంద్రబాబు ఏనాడూ ఆలోచన చేయలేదన్నారు. లోటు వర్షపాతం స్పష్టంగా కనిపిస్తున్నా డ్రామాలు ఆడారని, స్విచ్‌లు నొక్కడం, లాకులు ఎత్తడం, ఫొటోలకు ఫోజులివ్వడం చేశారని తెలిపారు. ప్రభుత్వ మాటలు నమ్మి సాగులోకి దిగిన రైతులు ఇప్పుడు తీవ్ర కరువు పరిస్థితుల్లో నిండా మునిగారని, ప్రతి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టపోయారని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరి ఉచిత పంటల బీమా ఉంటే రైతుకు భరోసా ఉండేదన్నారు. పల్నాడు జిల్లాలో ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులపై పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement