సత్తెనపల్లి: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఆదివారం స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల్లోని ప్రత్యేక శిబిరాల్లో బూత్‌స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. ఓటర్ల నుంచి క్‌లైయిమ్‌లు, అభ్యంతరాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఇటీవల ప్రచురించిన ముసాయిదా జాబితాలను సైతం అందుబాటులో ఉంచుతారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు ఉందో, లేదో పరిశీలించుకోవచ్చు.వివరాల్లో ఏవైనా తప్పులు, అభ్యంత రాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేగాక ఓటర్లు తమ సెల్‌ఫోన్ నుంచి 1950 నెంబర్‌కు మెసేజ్ పంపటం ద్వారా కూడా తమ ఓటు నమోదు స్థితిని తెలుసుకోవచ్చు. మెసేజ్‌లో ఈసీఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఈపీఎల్‌సీ నంబర్ నమోదు చేసి 1950 కు పంపితే ఓటరు వివరాలు, సర్ నమోదు స్థితికి సంబంధించిన సమాచారం తెలుస్తోంది. అంతేగాక కొత్తగా ఓటు నమోదు చేసుకున్నవారు, చిరునామా, పేరు, ఫోటో లేదా ఇతర వివరాల్లో మార్పులకు దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఈ విధానంలో తమ వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించారు.


