రేకుల షెడ్లు వేసి పార్టీ జెండాలు ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తలు వారం క్రితం ఆక్రమించినా తెలియదని అధికారుల బుకాయింపు
నరసరావుపేట: నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలకు అంతేలేకుండా పోయింది. అధికారాన్ని అడ్డంపెట్టుకొని వారం క్రితం నలుగురు కార్యకర్తలు సత్తెనపల్లి రోడ్డులోని సుమారు 37 ఎకరాల విస్తీర్ణంలోని కత్తవ చెరువులో కొంతభాగం ఆక్రమణలకు పాల్పడ్డారు. ఒకటవ వార్డులోని చెరువుకు ఉత్తరం వైపున సుమారు 12 సెంట్ల స్థలంలో మట్టిపోసి చదును చేశాక రేకుల షెడ్లు వేశారు. అధికారులు అటు వాటివైపు చూడకుండా ఆ షెడ్ల ముందు విద్యాశాఖా మంత్రి నారాలోకేష్ ఫొటోలతో ఉన్న టీడీపీ జెండాలు పాతారు. సాయినగర్‌కు చెందిన శ్రీనివాస్, ఓ రేషన్‌డీలర్‌తో పాటు మరో ఇద్దరు టీడీపీ వర్గీయులు ఈ ఆక్రమణలకు కారణమని స్థానికులు చెబుతున్నారు. స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన వారికి సమీపంలోని రేషన్ డీలర్ వృద్ధాశ్రమానికి స్థలం ఇచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారు.
నిధులు మంజూరు
రెండు నెలల క్రితం కత్తవ చెరువును సుందరీకరణ చేసేందుకు అమృత్ పథకం కింద ఏపీ అర్బన్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ (ఏపీయూజీబీసీ) సంస్థ రూ.5.50 కోట్లతో పనులు మొదలు పెట్టారు. ప్రొక్లయినర్‌తో చెరువులోని పిచ్చిమొక్కలు తలగించారు. సుమారు వందేళ్ల క్రితం ఈ చెరువు ఆవిష్కృతమైంది. పట్టణంలోని కత్తవ కాలువ గుండా వచ్చే నీరు అందులో చేరేది. దానికింద ఆయకట్టు కూడా ఉంది. చాలామంది రైతులు తమ పొలాల్లో పశువుల గడ్డిని పెంచుతున్నారు. కొన్నేళ్లుగా చెరువు కట్టలు అదృశ్యమై ఆక్రమణలకు నిలయంగా మారింది. సత్తెనపల్లిరోడ్డులో ఆ వైపున ఉన్న చెరువు కట్టను తొలచి లోపలికి ఆక్రమించుకుంటూ అనేక షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మాణాలు చేశారు. జిల్లా కేంద్రమైన తర్వాత పట్టణంలో ఏ మూల చూసినా సెంటు స్థలం రూ.15లక్షల నుంచి రూ.20లక్షల వరకు పలుకుతోంది. దీంతో అక్రమార్కుల దృష్టి ఈ చెరువుపై పడింది. అధికార బలాన్ని ఉపయోగించి అప్పనంగా ఆక్రమించుకొని కొన్నిరోజుల పాటు తమ కిందే ఉంచుకొని వాటిని ఎంతోకొంతకు అమ్ముకుంటూ లాభ పడు తున్నారు.


