విజయపురి సౌత్: మాచర్ల మండలంలోని ఎత్తిపోతల జలపాతం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని తీసుకురానుంది. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నెలవైన ఎత్తిపోతల జలపాతాన్ని తిలకించేందుకు నిత్యం పర్యాటకులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో సరికొత్త థ్రిల్, వినోదం, అడ్వెంచర్ అనుభూతిని అందించేందుకు జిప్‌లైన్, జిప్ సైక్లింగ్ కార్యకలాపాలను ఏపీటీడీసీ టూరిజం యూనిట్ ఎత్తిపోతల జలపాతం వద్ద ఏర్పాటు చేసింది. రైన్‌బో ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో పర్యాటకశాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ అడ్వెంచర్ కార్యకలాపాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఎత్తిపోతలను మరింత ఆకర్షణీయమైన అడ్వెంచర్, ఫ్యామిలీ టూరిజం డెస్టినేషన్‌గా అభివృద్ధి చేయడంలో కీలకంగా మారనున్నాయి. దీంతో ప్రకృతి ప్రేమికులకు మరింత ఆనందంగా గడిపే అవకాశం లభించనుంది. ఈ మేరకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రగతికి ఊతం
ఎత్తిపోతలలో ఏకముఖి దత్తాత్రేయ స్వామి ఆలయం, శ్రీరంగనాథ స్వామి దేవాలయాలు ఆధ్యాత్మికతతో వెల్లివిరుస్తున్నాయి. ఇప్పటికే ఎత్తిపోతల జలపాతం ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రారంభం కానున్న అడ్వెంచర్ కార్యకలాపాలతో పర్యాటకులు మరింత ఎక్కువ సమయం గడిపే అవకాశం ఏర్పడనుంది.
భద్రతకు ప్రాధాన్యం
ఎత్తిపోతల జలపాతానికి వచ్చే ప్రతి పర్యాటకుడికి ఒక ప్రత్యేకమైన, సురక్షితమైన, మరుపురాని అనుభూతిని అందించాలన్నదే లక్ష్యమని రైన్‌బో ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు పరికరాలు, నిర్మాణాలు, భద్రతా వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలతో కలిసి రూ.1.71 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనుందన్నారు. హోటళ్లు, రవాణా, చిన్న వ్యాపారాలు, పర్యాటక ఆధారిత కార్యకలాపాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.


