పల్నాడు జిల్లా రోడ్లపై రాత్రిళ్లు వెలుతురు కరువు విద్యుత్ దీపాలు ఉన్నా వెలగవు.. వెలిగినా ఉపయోగం అంతంతే వాహనదారులకు తీవ్ర అసౌకర్యంతోతరచూ ప్రమాదాలు జిల్లా కేంద్రం నరసరావుపేటలోనే విద్యుత్ దీపాల కొరత
ప్రధాన కూడలిలోనూ...
నరసరావుపేట టౌన్: పగలంతా వాహనాల రద్దీ.. రాత్రయితే విద్యుత్ దీపాలు వెలగక అలుముకునే చీకటి.. ఇదీ పల్నాడు జిల్లాలోని అన్ని పట్టణాల్లో పరిస్థితి. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గురజాల వంటి పురపాలక సంఘాల్లోని ప్రధాన రహదారులు, కీలక కూడళ్లలో సరిపడా వెలుతురు లేక వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా పట్టణాలకు ఆనుకొని జాతీయ రహదారులు ఉండటంతో రాత్రుళ్లు తిరిగే వాహనాల సంఖ్య ఎక్కువైంది. జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణ నడిబొడ్డున ఉన్న మల్లమ్మ సెంటర్ రాత్రివేళల్లో చిమ్మచీకటిని తలపిస్తోంది. ట్రాఫిక్ సిగ్నళ్లు, డివైడర్లు ఎక్కడున్నాయో వాహనదారులకు సరిగ్గా కనిపించక తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక మిగిలిన పట్టణాల్లో ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రాత్రి వేళ కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగక అంధకారం నెలకొంటోంది. వాహనదారులకు రహదారి సరిగ్గా కనిపించక తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
వీధి దీపాల్లో తగ్గిన కాంతి..
పురపాలక సంఘాల్లో ఎప్పుడో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లు ప్రస్తుతం ఆశించిన స్థాయిలో కాంతి ఇవ్వటం లేదు. కాలం గడిచేకొద్దీ వాటి వెలుతురు సామర్థ్యం తగ్గటంతో రహదారులపై ప్రకాశవంతమైన కాంతి కనిపించటం లేదు. దీంతో చాలా చోట్ల విద్యుత్ దీపాలు ఉన్నప్పటికీ వాటి వల్ల ప్రయోజనం లేకుండా పోతోందని వాహనదారులు చెబుతున్నారు. వీధిదీపాలను మార్చి కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ మరమ్మతులతో సరిపెడుతున్నారు. అవసరమైన పలు ప్రాంతాల్లో అదనపు వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు తగిన చర్యలు తీసుకోవటం లేదు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. చీకటిని ఆసరాగా చేసుకొని దొంగతనాలు చోటుచేసుకునే అవకాశాలూ లేకపోలేదు. అవసరమైన ప్రధాన కూడళ్లు, జంక్షన్‌లలో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసి రాత్రంతా పూర్తిస్థాయిలో వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
హైదరాబాద్, గుంటూరు, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల వైపు నుంచి నరసరావుపేటకు రాకపోకలు సాగించే వాహనాలు నరసరావుపేటలోని మల్లమ్మ సెంటర్ మీదుగానే వెళ్లాలి. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఈ కూడలి పట్టణానికి ప్రధాన ప్రవేశ మార్గంగా ఉంది. ఇంతటి ముఖ్య ప్రాంతంలో రాత్రిళ్లు సరైన వెలుతురు లేకపోవడం పట్ల వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్లమ్మ సెంటర్ మధ్యలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నళ్లను ఇప్పటికే పలుమార్లు భారీ వాహనాలు ఢీకొన్న ఘటనలు ఉన్నాయి. రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్లను సైతం వాహనాలు ఢీకొంటున్నాయి. వీటన్నింటికీ అక్కడ సరైన వెలుతురు లేకపోవటమే కారణం.


