గణేష్‌ మండపాల్లో విద్యుత్‌ భద్రత ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

గణేష్‌ మండపాల్లో విద్యుత్‌ భద్రత ముఖ్యం

Sep 9 2026 3:04 AM | Updated on Sep 9 2026 3:04 AM

వినాయక చవితి మండపాలకు తాత్కాలిక విద్యుత్‌ సరఫరా 500 వాట్లకు రూ. వెయ్యి, వెయ్యి వాట్లకు రూ.2,250 ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పి. పుల్లారెడ్డి వెల్లడి

నరసరావుపేట: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్‌ మండపాల్లో విద్యుత్‌ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భక్తితో పూజిద్దాం.. భద్రతతో పండుగ జరుపుకొందామని ప్రతి ఒక్కరూ భావించాలని పిలుపునిచ్చారు. మండపాల్లో విద్యుత్‌ అలంకరణలు, తాత్కాలిక విద్యుత్‌ వినియోగం విషయంలో నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. గణేష్‌ మండపాలను విద్యుత్‌ స్తంభాలు, తీగలకు తగినంత దూరంలో ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల పైనుంచి విద్యుత్‌ తీగలు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్‌ అలంకరణలకు నాణ్యమైన వైర్లు, స్విచ్‌లు, ప్లగ్‌లు మాత్రమే వినియోగించాలని తెలిపారు. మండపాలకు అనధికారికంగా విద్యుత్‌ కనెక్షన్లు తీసుకోవద్దని స్పష్టం చేశారు. మండపాల వద్ద విద్యుత్‌ అలంకరణలు ఏర్పాటు చేసే సమయంలో భక్తులు, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని తెలిపారు. అత్యవసర వాహనాలు, సేవలకు ఆటంకం కలుగకుండా మండపాల నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ వరకు గణేష్‌ మండపాలకు తాత్కాలిక విద్యుత్‌ సరఫరా అందించనున్నట్లు తెలిపారు. 500 వాట్లకు రూ.వెయ్యి, వెయ్యి వాట్లకు రూ.2,250 చొప్పున రుసుం ఉంటుందని ఆయన వెల్లడించారు. మండపాల నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టవిరుద్ధంగా విద్యుత్‌ను వినియోగించరాదని సీఎండీ హెచ్చరించారు. అనధికారిక కనెక్షన్లు తీసుకోవడం లేదా అక్రమంగా విద్యుత్‌ వినియోగించడం నేరమని తెలిపారు. అలాంటివి గుర్తిస్తే నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement