కొత్త విధానంపై కనీస శిక్షణ శూన్యం బలవంతంగా రుద్దుతున్న టీడీపీ ప్రభుత్వం తలలు పట్టుకుంటున్న హమాలీలు, డీలర్లు సాంకేతిక సమస్యతో సరకుల పంపిణీకి తప్పని తిప్పలు
జిల్లాలో పరిస్థితి ఇదీ...
సత్తెనపల్లి: దారిద్య్ర రేఖకు దిగువనున్న నిరు పేదలకు చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యం అక్రమాల కట్టడానికి ప్రభుత్వం ఇటీవల క్యూఆర్ కోడ్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి చౌక దుకాణాల డీలర్లు తీసుకెళ్లే బియ్యానికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఆపై దుకాణాల వద్దకు సరఫరా అయ్యే బియ్యానికి ఇలా స్కాన్ చేసిన తర్వాతే బియ్యాన్ని డీలర్లకు ఇవ్వాలి. ఈ విధానంతో అటు స్టాక్ పాయింట్లలో గానీ, ఇటు చౌక దుకాణాల్లో గానీ బియ్యం సక్రమంగా కచ్చితమైన తూకం ఉండాలన్నదే లక్ష్యం. ఈ విధానాన్ని ఈ నెల నుంచి జిల్లా వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అమలు చేస్తోంది. అయితే ఈ కొత్త విధానం తమకు ఇబ్బందికరంగా మారిందని చౌక దుకాణాల డీలర్లు గగ్గోలు పెడుతున్నారు.
అక్రమాలకు చెక్ పడేనా?
రేషన్ బియ్యం సరఫరాలో నిత్యం పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఎంఎల్‌ఎస్ పాయింట్లలో బియ్యం బస్తాలను పందికొక్కులు కొరికాయని, కొంత బియ్యం నేలపాలైందని చెప్పేవారు. ఇదే బియ్యాన్ని చౌక దుకాణాలకు పంపిణీ చేశాక అక్కడ జరిగిన నష్టాన్ని డీలర్లు తూకాల్లో కాస్త చూసుకొనే సరిచేసుకునేవారు. ఇకపై ఎక్కడా అక్రమాలకు తావివ్వకుండా ఉండేందుకు క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో చెక్ పెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి స్టాక్ పాయింట్ (గోడౌన్)లో నుంచి క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా చౌక దుకాణాలకు చేరిన బియ్యం కచ్చితంగా సరైన తూకం ఉంటుంది. దీంతో చౌక దుకాణాల డీలర్లు ఏమీ మాట్లాడేందుకు వీలు కాదు. డీలర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆపై తమ పెడ్డీ ప్రొక్యూర్‌మెంట్ సిస్టం (పీపీఎస్) యాప్ ద్వారా సబ్మిట్ చేసి ఈ–పాస్ ద్వారా ఆర్వో జనరేట్ చేసి ట్రాక్ షీట్‌ను చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఇదంతా కష్టతరమని చౌక దుకాణాల డీలర్లు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు.
తప్పని తలనొప్పులు..
ఈ కొత్త విధానంపై అవగాహన లేని చౌక దుకాణాల డీలర్లకు తలనొప్పులు తప్పడం లేదు. ఎందుకంటే కొందరు డీలర్లకు స్మార్ట్ ఫోన్లు లేవు. వీరు యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే కొత్త లింక్‌ను సెండ్ చేస్తున్నారు. ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో దిక్కుతోచడం లేదు. దీంతోపాటు బియ్యం బస్తాలను షాపుల వద్దకు దించే హమాలీలు ప్రతి బస్తా స్కానింగ్ చేసేందుకు గంటల సమయం పడుతోంది. బియ్యం బస్తాలపై ఉన్న క్యూఆర్ కోడ్‌లు చిరిగిపోయి ఉంటే మరింత ఇబ్బందిగా మారుతోంది. మొత్తం మీద సాంకేతిక సమస్యలు డీలర్లకు తలనొప్పులు తెప్పిస్తున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 1,289 చౌక దుకాణాలు ఉన్నాయి. ప్రతి బస్తా (50 కిలోలు) క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గానీ పంపిణీ సాధ్యం కాదు. ప్రతి నెలా 15వ తేదీలోపు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. కొత్త విధానంతో ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుందనే మాట డీలర్ల నోట వినిపిస్తోంది. దీనిపై పౌరసరఫరాల శాఖ తొలుత డీలర్లకు శిక్షణ ఇచ్చి ఆపై అమలు చేస్తే మేలనే మాట వినిపిస్తోంది.
పల్నాడు జిల్లాలో గణాంకాలు...
చౌక దుకాణాలు : 1,289
రైస్ కార్డులు : 6,46,649
రైస్ కార్డుల్లోని సభ్యులు : 18,57,207 మంది
ఎంఎల్‌ఎస్ పాయింట్లు : 10
ప్రతి నెలా సరఫరా
చేసే బియ్యం : 8,600 మెట్రిక్ టన్నులు


