అచ్చంపేట: మండలంలోని తాళ్లచెరువులో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి బుధవారం నిర్వహించారు. మాజీ సర్పంచి కిక్కురు అర్లారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తుమ్మా పాపిరెడ్డి, తుమ్మా జోసఫ్‌రెడ్డి, దొండేటి చిన్నపరెడ్డి, తుమ్మా శౌర్రెడ్డి, గోపు రాయపరెడ్డి, తుమ్మా సుధాకర్ రెడ్డి, గంజి రాయపురెడ్డి, ఎంపీటీసీ గోపు అంతోనిరెడ్డి తదితరుల ఆద్వర్యంలో నిరుపేదలకు అన్నదాన చేశారు. వెయ్యి మందికి పైగా అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఫ్లయింగ్ టెన్నిస్ జట్ల సత్తా
చిలకలూరిపేట టౌన్: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో అమెచ్యూర్ ఫ్లయింగ్ టెన్నిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ సౌత్ జోన్ చాంపియన్‌్ షిప్ పోటీల్లో ఏపీ బాలబాలికల జట్లు సత్తా చాటాయి. వివిధ విభాగాల్లో పోటీపడి మూడు స్థానాలను కై వసం చేసుకుని రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చాయి. సబ్‌జూనియర్ బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు ప్రథమ స్థానం సాధించగా, జూనియర్ బాలుర విభాగంలో ద్వితీయ స్థానం, జూనియర్ బాలికల విభాగంలో ద్వితీయ స్థానం సాధించింది. విజేతలను అభినందిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాకారులకు మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. దక్షిణ భారత స్థాయిలో రాష్ట్ర క్రీడాకారులు ప్రతిభ చాటడంపై అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. క్రీడల్లో మరింతగా రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. విద్యార్థుల విజయానికి శిక్షణ, క్రమశిక్షణతో పాటు పీఈటీలు, కళాశాల యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహం దోహదపడిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అమెచ్యూర్ ఫ్లయింగ్ టెన్నిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కొల్లా సతీష్ కుమార్, కార్యదర్శి బొంత కృపారావు, ఉపాధ్యక్షుడు ఈ శ్రీకాంత్, కోశాధికారి గురునాథ్, డీఆర్‌ఎంఎస్ కళాశాల పీడీ పి.ప్రవీణ్, పీఈటీ నవీన్, కావ్య పాల్గొన్నారు.
కొనసాగుతున్న సీనియర్ వైద్యుల నిరసన
గుంటూరు మెడికల్: గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో ఆగస్టు 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా గుంటూరు మెడికల్ కాలేజ్, ప్రొఫెసర్లు బుధవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గుంటూరు మెడికల్ కాలేజీ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ దేవ కుమార్ మాట్లాడుతూ 2016 నుంచి రావాల్సిన జీతం బకాయిలు చెల్లించాలని, 2026 జనవరి నుంచి ఇవ్వాల్సిన 8వ యూజీసీ వేతనాల సవరణ, ఇతర డిగ్రీ కాలేజ్ బోధకులకు ఇచ్చినట్లే, యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ రాజా కుమార్, డాక్టర్ గాజుల రామకృష్ణ, డాక్టర్ స్వరూప్ కాంత్, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ కమల రాజేశ్వరి, సునీత పాల్గొన్నారు.


