ఎల్‌నినోతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి

Sep 2 2026 2:52 AM | Updated on Sep 2 2026 2:52 AM

నరసరావుపేట: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో ఖరీఫ్‌ 2026 పంటల పరిస్థితి, ఎల్‌నినో ప్రభావం, చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సాగర్‌ కుడి కాలువ ద్వారా వరి సాగుకు అవసరమైన నీటిని విడుదల చేసే అవకాశం లేని పరిస్థితి ఉన్నందున నీటి వినియోగం అధికంగా ఉండే వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఇప్పటివరకు సాగు కాకుండా మిగిలిపోయిన 89,834 హెక్టార్ల పంట భూములలో సాగుకి అవసరమైన వర్షపాతం నమోదు అయినట్లైతే సెప్టెంబర్‌ నెలాఖరు వరకు సాగుకి అనువైన కంది, మినుము, కూరగాయలు, గడ్డి జొన్న, సుబాబుల్‌ తదితర పంటల సాగు చేసేవిధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. శనగసాగు రబీ సీజన్‌లో అక్టోబర్‌ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ పంట నమోదు, సాగు చేసిన పంటల ఆరోగ్య పరిస్టితిని రైతు సేవా సిబ్బందిని ద్వారా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో రైతుల నమోదు లక్ష్యం 3,12,583 మంది కాగా, ఇప్పటివరకు 2,56,082 మంది నమోదయ్యారని తెలిపారు. రైతు యాప్‌ డౌన్‌న్‌లోడ్‌ లక్ష్యం 2,40,530 మంది కాగా, ఇప్పటివరకు 1,25,735 మంది రైతులు యాప్‌ను డౌన్‌న్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. మిగిలిన రైతులు కూడా నమోదు చేసుకుని రైతు యాప్‌ను డౌన్‌న్‌లోడ్‌ చేసుకునేలా రైతు సేవా కేంద్రాల సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. కౌలు రైతులకు రూ.101.50 కోట్ల రుణాల మంజూరు లక్ష్యానికిగాను, గత నెల 12 నాటికి రూ.6.60 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. బ్యాంకు వారీగా రుణ మంజూరు చేసిన వివరాలను సేకరించాలని ఆదేశించారు. ‘‘రైతన్న మీ కోసం’’ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయిలో రైతులకు కరపత్రాల ద్వారా వర్షపాతం లోటు, నీటి లభ్యత, పంటల ఎంపిక, పంటల మార్పిడి, తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే పంటలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాల సంరక్షణ కోసం చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో నీటి గుంటల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ సిద్ద లింగమూర్తిని ఆదేశించారు. పశువుల మేతకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చెరువుల కింద, నీటి వసతి ఉన్న దగ్గర రైతులను గుర్తించి గడ్డి విత్తనాలు సాగు చేసేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. తొలుత జిల్లా వ్యవసాయ అధికారి ఐ.జగ్గారావు ఇప్పటివరకు జిల్లాలో పరిస్థితిని కలెక్టర్‌కు వివరించారు. ఖరీఫ్‌ 2026లో 1,57,932 హెక్టార్ల సాధారణ పంట విస్తీర్ణానికి గాను ఇప్పటివరకు 69,958 హెక్టార్లలో పంటలు సాగు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఈ కాలానికి సాధారణ వర్షపాతం 351.6మి.మీ కాగా, ఇప్పటివరకు 178.2 మి.మీ. మాత్రమే నమోదైందని, 49.3 శాతం లోటు వర్షపాతం ఉన్నట్లు వివరించారు. ఇప్పటివరకు ఖరీఫ్‌లో వరి 6118 హెక్టార్లు, పత్తి 58,604 హెక్టార్లు, మినుము 107 హెక్టార్లు, కంది 6,180 హెక్టార్లు, మొక్కజొన్న 510 హెక్టార్లలో సాగు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ముందస్తుగా పత్తి పంట సాగుచేసిన మండలాల్లో పంట దిగుబడి ఆశాజనకముగా వుందని, మార్కెట్‌లో క్వింటాల్‌ రు.8500–8800 వరకు రైతులు అమ్ముకుంటున్నారని కలెక్టర్‌కు తెలియచేశారు. వ్యవసాయ శాఖ, డీఆర్‌డీఏ, ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, డ్వామా, సాగునీటి శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement