కలెక్షన్ల కనెక్షన్‌! | - | Sakshi
Sakshi News home page

కలెక్షన్ల కనెక్షన్‌!

Aug 22 2026 1:29 AM | Updated on Aug 22 2026 1:29 AM

కలెక్షన్ల కనెక్షన్‌!

ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు లంచం ఇవ్వాల్సిన దుస్థితి వాణిజ్య భవనాలు, అపార్ట్‌మెంట్లు, వెంచర్లకు ‘రేటు’ ఫిక్స్‌ ఇష్టారాజ్యంగా మారిన వసూళ్లతో వినియోగదారులు బెంబేలు లంచం ఇవ్వనిదే సామాన్యులకు అందని విద్యుత్‌ సేవలు

కొరత సాకుతో వసూళ్ల పర్వం

విద్యుత్‌ శాఖలో సిబ్బంది నుంచి అధికారుల వరకు అవినీతి లీలలు

సాక్షి, నరసరావుపేట: విద్యుత్‌ శాఖలో అవినీతి తారస్థాయికి చేరింది. ప్రతి పనికి రేట్‌ నిర్ణయించి మరీ వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. అడిగినంత ఇవ్వకుంటే కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిప్పుకొంటున్నారు. దీంతో గత్యంతరం లేక అమ్యామ్యాలు సమర్పించి కనెక్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పల్నాడు జిల్లా కేంద్రంగా నరసరావుపేట ఏర్పాటైనప్పటి నుంచి విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారుల కార్యాలయాలు తరలివచ్చాయి. మెరుగైన సేవలు అందుతాయని ఆశపడ్డ వినియోగదారులకు భంగపాటు ఎదురవుతోంది. నూతన విద్యుత్‌ మీటర్‌ కావాలన్నా.. ట్రాన్స్‌ఫార్మర్‌ తీసుకోవాలన్నా అధికారులకు చేయి తడపనిదే ఫైల్‌ ముందుకు కదలడం లేదు. దీంతో సామాన్యుడికి విద్యుత్‌ కనెక్షన్‌ పొందడం కష్టంగా మారింది. వారు అడిగినంత ఇవ్వలేక, అత్యవసరమైన విద్యుత్‌ కనెక్షన్‌ రాక అవస్థలు పడుతున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.లక్ష..

ట్రాన్స్‌ఫార్మర్‌ కనెక్షన్‌ కోసం నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు కొర్రీలు పెడుతూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. డెవలప్‌మెంట్‌ చార్జెస్‌, సెక్యూరిటీ డిపాజిట్‌, సర్వీస్‌ లైన్‌ చార్జెస్‌ పేరిట రూ.లక్షలు చలానాల రూపంలో కట్టించుకున్నారు. పైగా లంచం రూపంలో ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.లక్ష వసూలు చేస్తున్నారు. అడిగినంత చెల్లించకపోతే ఒక సీటు నుంచి మరో సీటుకు తిప్పుతూ నెలల తరబడి పని పెండింగ్‌లో పెడుతున్నారని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. చివరకు విసిగిపోయిన వారు ‘పని త్వరగా కావాలంటే’ ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆరోపిస్తున్నారు. 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.50 వేలు, అంతకుపైబడి ఉంటే రూ.లక్ష వరకు లంచం రూపంలో తీసుకుంటున్న విషయం బహిరంగ రహస్యంగా మారింది. తీసుకున్న లంచం డబ్బుతో కింది నుంచి పైస్థాయి అధికారి వరకు వాటాలున్నట్టు సదరు సిబ్బంది చెప్పుకొస్తున్నారు. ఇక రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల నిర్వహకుల వద్ద నుంచి భారీ మొత్తంలో ముడుపులు తీసుకుంటున్నారు. పల్నాడు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అనుమతులు లేకుండా వేస్తున్న రియల్‌ వెంచర్లలో కాసుల పంట కురుస్తోంది. అధికారులు అడిగినంత ఇవ్వకపోతే పౌడా అనుమతులు లేవన్న సాకు చూపి విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడం లేదు.

సామాన్యుడికే నిబంధనలు..

వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్లు, భారీ భవనాలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు విద్యుత్‌ కనెక్షన్ల విషయంలో భారీగా అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. అధిక లోడ్‌ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ లైన్ల ఏర్పాటు, అనుమతుల ప్రక్రియలో ‘రేట్లు’ నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడిగినంత పైకం ముట్టగానే చకచకా పనులు చక్కబెడుతున్నారు. వాణిజ్య భవన యజమానులకు అనువుగా రోడ్లపై ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌కు సైతం అంతరాయం కలిగిస్తున్నారు. సాధారణ వినియోగదారుడు చిన్నపాటి విద్యుత్‌ శాఖ సేవలకు నిబంధనల పేరుతో కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. నిబంధనలను అందరికీ సమానంగా అమలు చేస్తున్నారా? లేక ఆర్థిక స్థోమతను బట్టి వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయాల్లో పెండింగ్‌ దరఖాస్తులు, కనెక్షన్ల మంజూరు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు తదితర అంశాలపై ఉన్నతాధికారులు క్రమం తప్పకుండా సమీక్షిస్తే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రజలు కోరుతున్నారు.

చీకటిని తరిమే వెలుగుల శాఖలో అవినీతి నీడలు కమ్ముకున్నాయి. కొత్త కనెక్షన్‌ కోసం తిరిగేవారి నుంచి అధికారులు కలెక్షన్‌ చేస్తేగానీ పని ముందుకు కదలడం లేదు. వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్లకు సంబంధికులు కాసులిస్తేనే విద్యుత్‌ కనెక్షన్లు వస్తున్నాయి. ఈ వాటాలు పైస్థాయి వరకు వెళుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు సర్కారు వచ్చాక అవినీతి దందాకు అంతే లేకుండా పోయింది. అడిగినంత చెల్లించలేని వారికి అష్టకష్టాల షాక్‌ తప్పడం లేదు.

వినియోగదారుడు ట్రాన్స్‌ఫార్మర్‌కు మీ సేవలో దరఖాస్తు చేయగానే సంబంధిత కార్యాలయానికి ఫైల్‌ వెళుతుంది. సెక్షన్‌ ఆఫీసర్‌ పరిశీలన నిర్వహించి.. ఏర్పాటు చేయనున్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎంత దూరంలో 11 కేవీ లైన్‌ ఉంది, ఎన్ని స్తంభాలు అవసరమవుతాయన్న అంచనాలు వేసి, వాటి ఆధారంగా చలానా కట్టమని డిమాండ్‌ నోటీసు అందజేస్తారు. ఆ డబ్బులు కట్టిన తరువాత కాంట్రాక్టర్‌ను కేటాయిస్తారు. అప్పుడే అసలు వ్యవహారం మొదలు అవుతుంది. మ్యాచింగ్‌ మెటీరియల్‌ అందజేసి ట్రాన్స్‌ ఫార్మర్‌ సరఫరా చేయరు. కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాకు ప్రత్యేక స్టోర్‌ లేదని, అందువల్ల వెంటనే అలాట్మెంట్‌ జరగడం లేదంటూ డిమాండ్‌ పెంచే ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. దీంతో అత్యవసరంగా విద్యుత్‌ కనెక్షన్‌ కావాల్సిన వారు అడిగినంత ఇచ్చి పనులు చేయించుకోవడం అనివార్యమవుతోంది. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకొని ప్రతి పనిలో అవినీతికి పాల్పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement