● కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
● ఓటరు పేరులో పుట్టిన తేదీ, రిలేషన్, ఇతర వివరాల్లో తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకోవడానికి ఫారం–8 (కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
● ఓటరు నివాసం మారిన సందర్భంలో ఒక పోలింగ్ బూత్ నుంచి మరొక పోలింగ్ బూత్‌కు ఓటును బదిలీ చేసుకోవడానికి ఫారం–8 (షిఫ్ట్ రెసిడెన్స్) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
● మరణించిన వారు, శాశ్వతంగా వేరే ప్రాంతానికి తరలివెళ్లిన వారు లేదా ఇతర కారణాలతో ఓటరు జాబితా నుంచి పేరు తొలగించాల్సిన సందర్భంలో ఫారం–7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
● ఓటరు జాబితాలో కొత్తగా నమోదు, సవరణలు, నివాస మార్పు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా సమర్పించాలి.
● ఈ నెల 30వ తేదీలోగా నమోదు, సవరణ ప్రక్రియలోకి వచ్చిన అర్హులైన ఓటర్ల వివరాలు మాత్రమే తదుపరి ఫైనల్ పబ్లికేషన్‌లో పరిగణనలోకి తీసుకోబడతాయి. కాబట్టి అర్హులైన ప్రజలు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తులను సమర్పించుకోవాలి.
● ప్రత్యేక శిబిరాల రోజుల్లో సంబంధిత బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. ప్రజలకు ఓటరు నమోదు, వివరాల సవరణకు సంబంధించిన సహాయ సహకారాలు అందిస్తారు.
● ప్రజలు సంబంధిత బీఎల్‌వోలను సంప్రదించడంతోపాటు, ఓటర్స్.ఈసీఐ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నేడు, రేపు, 29, 30 తేదీల్లో ఏర్పాటు 17 ఏళ్లకే ఓటు హక్కు దరఖాస్తుకు అవకాశం జిల్లాలో వేలాది మందికి ఉపయోగకరం
సత్తెనపల్లి: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకం. ఆ ఓటు హక్కు ద్వారానే సమర్థులైన ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పిస్తోంది. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లను నమోదు చేయడంతో పాటు, ఓటరు జాబితాలోని వివరాలను సరిచేసేందుకు ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఓటు హక్కు రావాలంటే 18 ఏళ్లు నిండాలి. అందుకోసం ఇప్పటివరకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి కోసం యువత వేచి చూడాల్సి వచ్చేది. తాజా నిబంధనల ప్రకారం 17 ఏళ్లు నిండగానే వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ఈసీ కల్పించింది. ముందుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ, 18 ఏళ్లు పూర్తిగా నిండిన తర్వాతే తుది ఓటరు జాబితాలో పేరు నమోదు కావడంతో పాటు ఓటు హక్కు లభిస్తోంది. జిల్లాలో వేలాది మంది యువతకు ఓటు హక్కు అవకాశం దక్కనుంది. యువత ఓటర్లుగా నమోదయ్యేందుకు ఈసీ ఏడాదిలో నాలుగు తేదీల్లో మాత్రమే వీలు కల్పించింది. ఆ మేరకు జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీల్లో ఫారం–6 ద్వారా ముందస్తుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుల వివరాలు..