ఐశ్వర్యలక్ష్మిగా బగళాముఖి | - | Sakshi
Sakshi News home page

ఐశ్వర్యలక్ష్మిగా బగళాముఖి

Aug 22 2026 1:29 AM | Updated on Aug 22 2026 1:29 AM

ఐశ్వర్యలక్ష్మిగా బగళాముఖి విజయకీల్రాదిపై శ్రావణ మహోత్సవాలు బంగారు ఆభరణాలు మాయంపై కేసు సాగునీరు అందించాలి

చందోలు(కర్లపాలెం): శ్రావణ మాస రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చందోలు బగళా ముఖి అమ్మవారు ఐశ్వర్యలక్ష్మిగా పూజలు అందుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేశారు. పూలు, పండ్లు, పసుపుకుంకుమలు సమర్పించి పూజలు నిర్వహించారు. అమ్మవారి ప్రసాదాలను స్వీకరించారు.

అమ్మవారి సేవలో జస్టిస్‌ భారతి

ఏపీ ఎండోమెంట్‌ ట్రిబ్యునల్‌ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ భారతి శుక్రవారం బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని, పూజలు చేశారు. ఆలయ అర్చకులు, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు సంప్రదాయాల ప్రకారం జస్టిస్‌ భారతికి స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం వేదాశీర్వచనం నిర్వహించాక అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ చక్రధర్‌రెడ్డి, ఈవో నరసింహ మూర్తి, పాలకవర్గ సభ్యులు ఉన్నారు.

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీల్రాది దివ్యక్షేత్రంపై శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ మేనేజర్‌ పురాణం వెంకటాచారి మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళశాసనాలతో శుక్రవారం ఉదయం దనలక్ష్మి, సంతాన లక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. అనంతరం మల్లెపూలతో సహస్ర నామార్చన ఘనంగా జరిగిందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు.

పెదకాకాని: శివాలయంలో భ్రమరాంబ అమ్మ వారి బంగారు ఆభరణాలు మాయంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో అర్చకులు మూడు బ్యాచ్‌లుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో గత శుక్రవారం ప్రత్యేక పూల అలంకరణ పురస్కరించుకుని అమ్మవారికి బంగారు ఆభరణాలు అలంకరించారు. వాటిలోని మంగళసూత్రాలు, నానుతాడు మంగళవారం కనిపించలేదు. విషయాన్ని స్థానాచార్యులు, ప్రధాన, ఉప ప్రధాన అర్చకుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆలయ అధికారులకు అర్చకుడు ప్రతాప్‌ అమ్మవారి మంగళసూత్రాలు, నానుతాడు కనిపించడం లేదని చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఆభరణాలు మాయంపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు.

ఇరిగేషన్‌ అధికారులకు రైతుల వినతి

పిట్టలవానిపాలెం(కర్లపాలెం): ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన వరి పైర్లు బతికించుకునేందుకు అవసరమైన నీరు విడుదల చేయాలని అల్లూరు గ్రామానికి చెందిన రైతులు జలవనరుల శాఖ అధికారులను కోరారు. శుక్రవారం అల్లూరు రైతులు పిట్టలవానిపాలెంలో ఉన్న జలవనరుల శాఖ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. సాగునీరు అందించాలని అధికారులను కోరారు. రైతులు మాట్లాడుతూ తమ పొలాలకు రావలసిన సాగునీటిని ఇరిగేషన్‌ అధికారులు రేపల్లె నియోజకవర్గంలోని పెద్దపల్లి గ్రామానికి మళ్లించటంతో తమ పైర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరు గ్రామంలో ప్రస్తుతం పది ఎకరాలలో మాత్రమే వరి నాట్లు వేశారని, అయినా నీరందక పైర్లు వాడిపోతున్నాయని తెలిపారు. పెద్దపల్లి గ్రామంలో 500 ఎకరాలకు పైగా సాగు జరుగుతోందని చెప్పారు. సాగునీటిని అక్కడికే మళ్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఇరిగేషన్‌ అధికారులు స్పందించి పంట కాలువల ద్వారా నీరిచ్చి పైర్లను బతికించాలని వేడుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement