జిల్లాలో ‘రెడ్‌ బుక్‌’ రాజ్యాంగం | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ‘రెడ్‌ బుక్‌’ రాజ్యాంగం

Aug 2 2026 1:46 AM | Updated on Aug 2 2026 1:46 AM

వైఎస్సార్‌ సీపీ మాజీ ఎమ్మెల్యే

బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజం

పార్టీ సోషల్‌ మీడియా ఉపాధ్యక్షుడు

వెంకట్రావు అరెస్ట్‌కు ఖండన

వినుకొండ: పల్నాడు జిల్లాలో అధికార పార్టీ ‘రెడ్‌ బుక్‌’ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా సోషల్‌ మీడియా ఉపాధ్యక్షుడు సన్నపనేని వెంకట్రావు అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని బ్రహ్మనాయుడు ఆరోపించారు. కొందరు పోలీసు అధికారులు ఏకపక్షంగా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులు రానున్న రోజుల్లో చట్టం ముందు సమాధానం చెప్పక తప్పదని హెచ్చరించారు. వెంకట్రావు కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, న్యాయపోరాటం చేసి ఆయనను త్వరలోనే విడుదల చేయిస్తామని బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు.

నా భర్తను అక్రమంగా అరెస్టు చేశారు

పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారనే కారణంతోనే తన భర్తపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని వెంకట్రావు భార్య రేణుక ఆరోపించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్యాలయానికి వెళ్లిన తన భర్తను పోలీసులు తీసుకెళ్లారని తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నాయన కనిపించడం లేదని ఫిర్యాదు ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ పోలీసులు తిరస్కరించారని, రాత్రంతా స్టేషన్‌ ముందు వేచి చూశామని చెప్పారు. శనివారం పార్టీ నాయకులు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ప్రశ్నించగా, అప్పుడే అరెస్టు చేసినట్లు చెబుతూ నోటీసులపై సంతకాలు తీసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులే ఈ విధంగా వ్యవహరించడం ఎక్కడా చూడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

న్యాయపోరాటం చేస్తాం

వెంకట్రావు చౌదరి అక్రమ అరెస్ట్‌పై సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘన కింద న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని న్యాయవాది, వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్‌.ప్రసాద్‌ తెలిపారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకే కూటమి ప్రభుత్వం ఇలా అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. వెంకట్రావు వివరాలు తెలుసుకునేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన నాయకులను కనీస మర్యాద లేకుండా బయటకు పంపించడాన్ని ఖండించారు. యాక్టివ్‌గా ఉండే వైఎస్సార్‌ సీపీ నాయకులపై నాన్‌ బెయిలబుల్‌ తప్పుడు కేసులు అలవాటుగా మార్చుకున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం తీవ్ర చట్ట వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement