నాదెండ్ల: ఖరీఫ్ సీజన్‌లో పత్తి సాగుపైనా రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. పత్తికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండనుందని వాతావరణ శాఖ అంచనాలు వెలువడుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్ధితులు, వేసవిని తలపించేలా ఎండలు, వడగాల్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఇదే సమయంలో వర్షాలు సకాలంలో కురవటంతో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఈ ఏడాది అందుకు భిన్నంగా వాతావరణం ఉండనుండటంతో సాగుపై సందిగ్ధంలో ఉన్నారు. గణపవరం గ్రామానికి చెందిన రైతు తొండెపు వెంకటేశ్వర్లు రెండు ఎకరాలతోపాటు ఆరెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. రెండు నెలల క్రితం కురిసిన వర్షానికి విత్తనాలు నాటారు. అప్పటి నుంచి వర్షాలు లేకపోవటంతో పత్తి మొక్కలు అరకొరగా మొలిచాయి. అడుగు మేర పెరిగి గిడసబారిపోయాయి. వాస్తవానికి ఈ సమయానికి పూత, పిందె దశకు రావాల్సి ఉంది. భిన్నమైన వాతావరణంతో పత్తి సాగుకు అనుకూలంగా లేదని భావించి ఒక సాలును నేలలో దున్ని వీటి స్థానంలో కంది విత్తనాలు ఎదబెట్టారు. పత్తిపై ఆశలు వదులుకున్న రైతు కందితోనైనా నష్టం తప్పుతుందని ఆశిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని చాలామంది పత్తి రైతుల పరిస్థితి ఇలాగే ఉండటంతో వాపోతున్నారు.


