నిత్యం ఏవేవో సర్వేల పేరుతో ఒత్తిళ్లు టార్గెట్‌లు పెట్టి మరీ క్షేత్రస్థాయి పనులు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు విలవిల మరోవైపు సకాలంలో సేవలు అందక ప్రజలకు అవస్థలు నిరంతర ఒత్తిడితో అనారోగ్యం పాలవుతున్న ఉద్యోగులు విధులకు సంబంధించి నిర్దేశిత ప్రకటన చేయాలని ప్రభుత్వానికి డిమాండ్
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ వ్యవస్థ ద్వారా సర్కారు సేవలన్నీ ప్రజల ముంగిటకే అందేవి. ఏ పని కావాలన్నా, ఏ సర్టిఫికెట్ పొందాలన్నా ఊరిలోనే లభించేది. పారదర్శక పాలన, సత్వర స్పందనతో ప్రజల మన్ననలు పొందిన ఆ వ్యవస్థ నేడు సమస్యలకు నిలయంగా మారింది. సచివాలయ ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం నిత్యం వివిధ రకాల సర్వేలు, కార్యక్రమాల పేరిట లక్ష్యాలు విధించి వేధిస్తోంది. ప్రజలకూ నిర్దేశిత సేవలు అందడం లేదు.
సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు సర్కార్ కక్షసాధింపు
సత్తెనపల్లి: ప్రభుత్వ సేవలు వేగంగా అందించాలని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరేలా చేయాలని 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రజల చెంతకే పాలనను తీసుకొచ్చారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రెవెన్యూ తదితర అన్ని రకాల ప్రభుత్వ సేవలను సచివాలయాల పరిధిలోనే అందుబాటులోకి తెచ్చారు. జిల్లాలో 404 గ్రామ సచివాలయాలు, 134 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 3,947 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గతంలో చిన్నచిన్న పనుల కోసం ప్రజలు మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ఆ పరిస్థితి మారింది. అనతికాలంలోనే ఈ వ్యవస్థకు ప్రజల్లో మంచి గుర్తింపు లభించింది. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో చంద్రబాబు ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ‘స్వర్ణ గ్రామ’, పట్టణ సచివాలయాలను ‘స్వర్ణ వార్డు’ సచివాలయాలుగా పేరు మార్చింది. అయితే పేరు మార్చడంపై చూపిన శ్రద్ధ, సేవలను మెరుగుపరచడంపై చూపలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎప్పుడూ తిరగాల్సిందే...
ప్రభుత్వం వివిధ రకాల సర్వేలు చేపట్టాలని సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉద్యోగులు సచివాలయంలో కంటే ఫీల్డ్‌లోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. పని మీద సచివాలయాలకు వచ్చే ప్రజలకు అక్కడ ఖాళీ కుర్చీలే కనిపిస్తుండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలోని అనేక సచివాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల ఒకరు, ఇద్దరు మాత్రమే కార్యాలయంలో కనిపిస్తున్నారు.
కావాలనే ఇలా...
దిగువ స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ లక్ష్యాల పేరుతో తమను వేధింపులకు గురిచేస్తున్నారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనగణన, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఈ–కేవైసీ, స్వచ్ఛ సర్వేక్షణ్, ’సర్’ తదితర పనులతో సతమతమవుతున్నారు. స్మార్ట్‌ఫోన్లు చేతబట్టి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, అలాగే మనమిత్ర కార్యక్రమాలను వార్డుల్లో ప్రచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని చెబుతున్నారు. కొంతమంది అధికారులు వింత పోకడలతో ప్రోగ్రెస్ చూపించాలని తీవ్రంగా వేధిస్తున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పరిపాలనా కార్యదర్శులకు గత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రాపర్టీ టాక్స్ వసూళ్లకు టార్గెట్లు విధించారు. ఇలా సచివాలయ ఉద్యోగులపై వారి విధులతో సంబంధం లేని ఇతర శాఖల పనులను కూడా నెత్తిన రుద్దుతూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని వారు వాపోతున్నారు. గతంలో వలంటీర్లు చేసే పనులను కూడా ఇప్పుడు సచివాలయ ఉద్యోగులతోనే చేయిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ పనిచేయిస్తూ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్దేశిత పనులే తమతో చేయించాలని వారు సర్కార్‌ను డిమాండ్ చేస్తున్నారు.


