మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్ సన్నపనేని వెంకట్రావు అక్రమ అరెస్ట్‌కు తీవ్ర ఖండన టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపాటు
వెంకట్రావు కుటుంబానికి బొల్లా పరామర్శ
వినుకొండ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వినుకొండ నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. వరుస హత్యలు, దోపిడీలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో జరిగిన అన్ని హత్యలపై వెంటనే సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందనడానికి వినుకొండే ప్రత్యక్ష ఉదాహరణ అని విమర్శించారు.
హత్యల పరంపరపై చర్యలు శూన్యం
రషీద్ హత్య, ఏబీఎం కాంపౌండ్‌లో యువకుడి హత్య, ముట్లకుంట కాలనీలో హత్య, కొత్తపేటలో బంగారం కోసం వెంకటరత్నం అనే మహిళతోపాటు ఆలపాటి పుష్పలత, కొప్పరపు సావిత్రి హత్యలపై పోలీసులు ఇప్పటికీ పూర్తిస్థాయి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వినుకొండలో నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతుంటే, ప్రశ్నించే వారిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు సన్నపనేని వెంకట్రావును చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకుని ఐదు మండలాలు తిప్పుతూ చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. పట్టణంలో పేకాట, బెట్టింగ్, వ్యభిచారం, గంజాయి వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనిఖీల పేరుతో ప్రజలను లంచాల కోసం వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.
మక్కెనపై విమర్శలు
ఇటీవల గోనుగుంట్లవారిపాలెం గ్రామానికి చెందిన పాలడుగు రాజు హత్య కేసు, అనంతర పరిణామాలను ప్రస్తావిస్తూ మాజీ ఎమ్మెల్యే, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తీరును బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. వినుకొండలో సంచలనం సృష్టించిన పాలడుగు రాజు హత్య కేసులో పోలీసులు ముక్కూముఖం తెలియని వ్యక్తులను అరెస్టు చేసి లోతైన దర్యాప్తు లేకుండానే కేసును మూసివేశారని ఆరోపించారు. మక్కెన మల్లికార్జునరావు డ్రైవర్ అయ్యన్న కుమారుడు రాజు హత్యకు గురైతే, న్యాయం కోరిన ఆ కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి బెదిరింపులకు గురిచేశారని విమర్శించారు. కుమారుడు హత్యకు గురైన పది రోజుల వ్యవధిలోనే బెదిరింపులు, మానసిక వేదన తట్టుకోలేక రాజు తండ్రి అయ్యన్న గుండెపోటుతో మృతి చెందారని అన్నారు. భర్త, కుమారుడిని కోల్పోయిన అయ్యన్న భార్య భయంతో గ్రామం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎవరు బెదిరించారో పోలీసులు ఫోన్లలో కాల్ డేటా పరిశీలిస్తే తెలుస్తుందన్నారు.
భూ అక్రమాలపై ఆరోపణలు
నూజెండ్ల మండలంలో యూరప్ దేశాల పారిశ్రామికవేత్తలు కొనుగోలు చేసిన తిరుమల డెయిరీ భూముల రికార్డులను ఆన్‌లైన్‌లో అక్రమంగా మార్చి రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపించారు. రాజకీయ భూ అక్రమాలను తాను ఆధారాలతో నిరూపిస్తానని, నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమని సవాల్ విసిరారు. ప్రభుత్వ అనుమతులు, ల్యాండ్ కన్వర్షన్ లేకుండా ప్లాట్లు విక్రయించి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. పన్నులు ఎగవేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నియోజకవర్గ ప్రజలందరికీ కాకుండా కేవలం టీడీపీ నాయకులకు మాత్రమే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తక్షణమే వినుకొండలో జరుగుతున్న హత్యలు, భూ అక్రమాలపై స్పందించి విదేశీ పెట్టుబడిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


