రెండేళ్లలో ఏకంగా నలుగురు బదిలీ సీబీఐకి డెప్యూటేషన్‌పై వెళ్తున్న ప్రస్తుత ఎస్పీ కృష్ణారావు ఐదో ఎస్పీ ఎవరంటూ జోరుగా ప్రచారం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయకపోతే బదిలీ వేటు
కొత్త ఎస్పీ ఎవరో?
చంద్రబాబు ప్రభుత్వంలో పల్నాడు ఎస్పీలకు సమస్యలు
సాక్షి, నరసరావుపేట : ప్రతిపక్షనేతలపై అక్రమ కేసులు, దాడులు పల్నాడులో నిత్యకృత్యంగా మారాయి. ఎన్నికల నాటి నుంచి బిందుమాధవ్, మల్లికాగార్గ్, కంచి శ్రీనివాసరావులు పనిచేసి బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న బి.కృష్ణారావు ఇప్పటికే రాష్ట్ర సర్వీస్ నుంచి కేంద్ర సర్వీసులోకి వెళ్లడానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. డెప్యూటేషన్‌పై సీబీఐలో సేవలు అందించనున్నారు.
వరుసగా బదిలీలే..
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎస్పీగా పనిచేస్తున్న బిందుమాధవ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్‌కు ముందే సస్పెన్షన్ వేటు వేసింది. పోలింగ్, ఆ తరువాత రోజు మాచర్ల, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాలలో జరిగిన అల్లర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారనే కారణంతో ఈ వేటు పడింది. ఆ తరువాత ఆయన స్థానంలో 2024 మే 18న మల్లికాగార్గ్ బాధ్యతలు స్వీకరించారు. ముక్కుసూటి అధికారిణిగా పేరున్న మల్లికాగార్గ్‌ను కొందరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బదిలీ చేయించారని ప్రచారం నడిచింది. అదే ఏడాది జూలై 13వ తేదీ వరకు అంటే ఆమె కేవలం రెండు నెలలు మాత్రమే విధులు నిర్వహించారు. ఇక్కడి నుంచి విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్‌కు కమాండెంట్‌గా వెళ్లారు.
పట్టుమని పది నెలలే...
మల్లికాగార్గ్ బదిలీ తరువాత ఆమె స్థానంలో ఎస్పీగా పల్నాడు జిల్లాకు కంచి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. కంచి శ్రీనివాసరావు హయాంలో జిల్లాలో రాజకీయ హత్యలు జరిగాయి. వీటి దర్యాప్తులో అధికారపార్టీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్టు సమాచారం. కేవలం 14 నెలలు మాత్రమే ఆయన విధులు నిర్వహించారు. అనంతరం బదిలీపై డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. ఆయన స్థానంలో 2025 సెప్టెంబర్ 14న బి.కృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఇక్కడి నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి గల కారణాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో చట్టానికి విరుద్ధంగా పనిచేయడం ఇష్టం లేక కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకున్నారని ప్రచారం సాగుతోంది. ఎస్పీ చాంబర్‌లోకి నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబు వెళ్లి గడి పెట్టుకొని రోజంతా హైడ్రామా నడిపిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పల్నాడు జిల్లాలో పోలీసు బాస్‌లకు అచ్చిరాలేదని చెప్పొచ్చు. ఎంతగా అంటే ఏకంగా రెండేళ్లలోనే జిల్లాకు ఐదో ఎస్పీ వచ్చేలా. కూటమి సర్కారు వచ్చినప్పటి నుంచి దాదాపుగా ఏ ఎస్పీ కూడా జిల్లాలో ఎక్కువ కాలం పనిచేయలేకపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయకపోతే బదిలీ వేటు పడుతోందంటూ పోలీసు వర్గాలలో చర్చ నడుస్తోంది.
కారణాలు ఏదైతేనేం పట్టుమని పది నెలలు కూడా పనిచేయకుండానే నిజాయతీ గల అధికారి జిల్లాను వదలి వెళ్లడం విచారకరమని పోలీసు వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బి.కృష్ణారావును ప్రభుత్వం రిలీవ్ చేసి ఆయన స్థానంలో కొత్త ఎస్పీని ఒకటి రెండు రోజుల్లో నియమించనుందని సమాచారం. ఆయన స్థానంలో రెండేళ్ల వ్యవధిలో ఐదో ఎస్పీగా ఎవరు వస్తున్నారనే చర్చ నడుస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లా ఏర్పడినప్పటి నుంచి తొలి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రవిశంకర్‌రెడ్డి రెండేళ్లకుపైగా సమర్థంగా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. కొత్తగా వచ్చే ఎస్పీ అయినా రవిశంకర్‌రెడ్డిలా ఎక్కువకాలం పనిచేస్తే జిల్లాపై పూర్తి అవగాహన వచ్చి శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి వీలు పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


