విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

Jul 7 2026 2:01 AM | Updated on Jul 7 2026 2:01 AM

● టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ● పల్నాడు కలెక్టరేట్‌ వద్ద నాయకుల ధర్నా

నరసరావుపేట: విద్యారంగంలో ముఖ్యంగా సంక్షేమ హాస్టల్‌లో ఉంటున్న పేద విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. తర్వాత కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్‌ఓ అద్దెయ్య, డీఈఓ పీవీజే రామారావులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్‌ కోట సాయి కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు రూ.7 వేల కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అందిస్తున్న మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలను కనీసం రూ.3 వేలకు పెంచాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, అవసరమైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) ఆధారిత హాజరు విధానాన్ని రద్దు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో జూనియర్‌, డిగ్రీ కళాశాలను, జిల్లాకు ఒక పీజీ సెంటర్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా బాలికల కన్వీనర్‌ నవిత మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో ఉండి విద్య అభ్యసిస్తున్న వారికి శానిటరీ ప్యాడ్‌, కాస్మెటిక్స్‌ చార్జీలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ధర్నాలో నాయకులు అమూల్య, రోహిత్‌, రామకృష్ణ, నాగూర్‌, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement