అగ్రహారం భూముల సర్వే పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

అగ్రహారం భూముల సర్వే పూర్తి చేయాలి

Jun 12 2026 6:03 AM | Updated on Jun 12 2026 6:03 AM

నరసరావుపేట: జిల్లాలోని వినుకొండ నియోజకవర్గం పరిధిలో ఉన్న అగ్రహారం భూముల సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, వచ్చే ఏడాది మార్చి నాటికి సెటిల్‌మెంట్‌తో సహా అన్ని పనులను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌ సంజనా సింహతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వినుకొండ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఈ అగ్రహారం భూములు విస్తరించి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నాలుగు మండలాల్లోని అగ్రహారం భూములకు సంబంధించిన సర్వేను తక్షణమే ప్రారంభించి, నిర్దేశిత గడువులోగా సెటిల్‌మెంట్‌ ప్రక్రియను ముగించాలని ఆమె స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సర్వే శాఖ ఏడీ శ్రీనివాస్‌, ఆర్‌డీఓ కె.బాలకృష్ణ, వినుకొండ, నూజెండ్ల, ఈపూరు, బొల్లాపల్లి తహసీల్దార్లు సురేష్‌, రమేష్‌, నళిని, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

తప్పులు లేకుండా ‘సర్‌’ నిర్వహణ

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమాన్ని పూర్తిగా పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఓటర్ల మ్యాపింగ్‌, డోర్‌ టు డోర్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియలపై గురువారం కలెక్టరేట్‌ నుంచి టెలీకాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సర్‌ క్షేత్రస్థాయి సర్వేపై రాజకీయపార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో బీఎల్‌ఓలు పూర్తి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. జూన్‌ 15 నుంచి జూలై 15 వరకు నిర్వహించే డోర్‌ టు డోర్‌ వెరిఫికేషన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని చెప్పారు. ఓటర్ల వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత ఓటర్లకు అందించి, వివరాలను పరిశీలించి కలర్‌ ఫొటోతో పాటు సంతకాలు తీసుకోవాలని సూచించారు. సరిపోలని వివరాలను మాస్టర్‌ డేటాతో తనిఖీ చేసి, ఎన్నికల డేటా బృందంతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయి సర్వే, మ్యాపింగ్‌, డిలీషన్‌ అంశాలపై ఏవైనా సందేహాలు ఉంటే ఎన్నికల డీటీ, ఏఈఆర్వో, ఈఆర్వోలను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, పూర్తి పారదర్శకతతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

అభివృద్ధి పనులకు

అనుమతుల మంజూరుకు ఆదేశం

జిల్లాలోని అటవీ ప్రాంత సరిహద్దుల్లో ఉన్న ప్రజల నివాసాలు, గిరిజన తండాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం అటవీశాఖ అనుమతులను నిబంధనల ప్రకారం తక్షణమే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సంజనా సింహ, జిల్లా అటవీ శాఖ అధికారిణి కృష్ణప్రియలతో కలిసి కలెక్టర్‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కోటప్పకొండ ఈవో, మార్కాపురం గ్రామీణ నీటి సరఫరా శాఖ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, ఐటీడీఏ అధికారి పీవో, ఏపీ విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా

Advertisement
 
Advertisement
Advertisement