ముఖం చూపితే రూ. 300 | - | Sakshi
Sakshi News home page

ముఖం చూపితే రూ. 300

Jun 11 2026 7:41 AM | Updated on Jun 11 2026 7:41 AM

రూ. 200 ఇస్తేనే ఉపాధి హామీ పని అధికారులు, సిబ్బంది కుమ్మక్కు నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం

పిడుగురాళ్ల రూరల్‌: తప్పుడు మస్టర్లతో మాయ... పని చేయకుండా చేసినట్లు బిల్లులు, కొలతలలో వ్యత్యాసాలు, పలు అక్రమాలకు పాల్పడుతూ ఉపాధి హామీ పథకంలో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. పని చేసారో లేదో భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఎక్కడా పని చేసిన దాఖలాలు లేవు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, మేట్లు, అధికారులు చేసే దందా అంతా ఇంతా కాదు. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు, క్షేత్రస్థాయి, గ్రామ స్థాయి సిబ్బంది చేతివాటంతో ఉపాధి హామీ పథకం నీరుగారిపోతోంది. పట్టించుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో భారీ స్థాయిలో ఉపాధి హామీ పథకంలో అవినీతి చోటు చేసుకుంది.

ఫొటో దిగితే ఒక పనైపోతుంది....

ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ సంవత్సరం ముఖ గుర్తింపు హాజరు విధానం అమలులోకి తీసుకొచ్చారు. కానీ కింది స్థాయి అధికారుల అక్రమాలకు హద్దు లేకుండా పోతోంది. కేవలం ఫొటో దిగితే రూ. 300 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రెండవ ఫొటోకు ఉపాధి హామీ పథకానికి వచ్చిన సభ్యులందరూ రావాలి. దీనిని తూతూ మంత్రంగా ముగించేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.

పని కావాలంటే రూ.200 ఇవ్వాల్సిందే...

అర్హులైన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని ఉపాధి హామీ పథకం చట్టం చెబుతోంది. కానీ పిడుగురాళ్ల మండలంలో దీనికి విరుద్ధంగా పరిస్థితి ఉంది. అవసరమైన వారికి పని కల్పించకుండా రూ. 200 ఇచ్చిన వారికి మాత్రమే పని కల్పిస్తున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు చేతివాటం చూపిస్తూ గ్రామస్థాయిలో రూ.వేలల్లో జేబులు నింపుకొంటున్నారు. పని కావాల్సిన ఉపాధి హామీ కూలీలకు ఉపాధి లేకుండాపోతోంది. మండలంలోని కామేపల్లి గ్రామంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు రూ. 200 ఇవ్వాలని కూలీలకు హుకుం జారీ చేస్తున్నారు.

అధికారుల మౌనముద్ర

ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంటే కొంత మంది గ్రామాలలోని అధికారులు జేబులు నింపుకొంటున్నారు. రూ.కోట్లకు పడగలెత్తిన వారికి, ఉపాధి పని అవసరం లేని వారికి కూడా పని కల్పిస్తున్నారు. అసలైన లబ్ధిదారులకు పని దొరకని పరిస్థితి నెలకొంది. అలాంటి వాటిని కట్టడి చేయాల్సిన అధికారులు ముడుపులు తీసుకొని ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఏదైనా అంటే ఫొటో క్యాప్చర్‌ ఉంది కదా అంటూ... దానిని సైతం ఫొటో దిగు... రూ. 300 వందలు పట్టు అనే చందంగా మార్చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement