భూసమీకరణ వివరాలు సీఆర్‌డీఏకు అందించండి | - | Sakshi
Sakshi News home page

భూసమీకరణ వివరాలు సీఆర్‌డీఏకు అందించండి

Jun 11 2026 7:41 AM | Updated on Jun 11 2026 7:41 AM

నరసరావుపేట: అమరావతి మండలంలో ల్యాండ్‌ ఫూలింగ్‌ (భూసమీకరణ)కు అంగీకరించిన రైతుల వివరాలతోపాటు, దేవదాయ, రెవెన్యూ శాఖల భూముల రికార్డులను త్వరితగతిన క్రోడీకరించి సీఆర్‌డీఏకి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ల్యాండ్‌ ఫూలింగ్‌, భూముల వివరాలపై జాయింట్‌ కలెక్టర్‌ సంజనా సింహతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ల్యాండ్‌ ఫూలింగ్‌ ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు సకాలంలో త్వరగా పరిహారం అందించడమే ప్రభుత్వ ముఖ్యోద్దేశమని స్పష్టం చేశారు.

ఇందుకోసం వివిధ శాఖల మధ్య సమాచార మార్పిడి సులభంగా, వేగంగా జరగాలని సూచించారు. అమరావతి మండల అధికారులు సమన్వయంతో పనిచేసి పూర్తి వివరాలు అందజేయాలని కోరారు. ఈ పరిధిలో ఉన్న దేవదాయ భూములు, రిజిస్టర్డు, అన్‌ రిజిస్టర్డు కాని భూములు, జరీబ్‌ భూములు, చెరువులు, కాలువ పోరంబోకు భూములను క్షేత్రస్థాయిలో సర్వే చేసి, స్పష్టమైన నివేదికను సిద్ధం చేయాలన్నారు.

16న చిలకలూరిపేటలో జాబ్‌మేళా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు చిలకలూరిపేటలోని మునిసిపల్‌ ఆఫీస్‌ రోడ్‌, అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కన ఉన్న ప్రత్తిపాటి గార్డెన్స్‌లో నిర్వహించే మెగా జాబ్‌మేళాను జిల్లాలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా కోరారు. జాబ్‌మేళా వాల్‌పోస్టర్‌ను తన కార్యాలయంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి తమ్మాజీరావుతో కలిసి బుధవారం ఆవిష్కరించారు.

తమ్మాజీరావు మాట్లాడుతూ జాబ్‌మేళాలో జోయలుకాస్‌, బుక్‌ ఎక్స్‌పోర్ట్‌, హెటిరో డ్రగ్స్‌, టీం కంప్యూటర్స్‌, డీమార్ట్‌, బిగ్‌ సి, మెడ్‌ ప్లస్‌, టెక్‌ సొల్యూషన్‌, అక్రో సాఫ్ట్‌ సొల్యూషన్‌, ఇసుజు మోటార్స్‌, జస్ట్‌ డయల్‌, టాటా కాపిటల్‌, ఫ్యూచర్‌ ఐటి సొల్యూషన్‌, రిలయన్‌న్స్‌ జియో, అఫెక్స్‌ సొల్యూషన్‌, ప్రీమియర్‌ ఎనర్జేస్‌ వంటి పలు రకాల కంపెనీలు హాజరవుతున్నాయని తెలిపారు. ఇతర వివరాలకు కిరణ్‌–7842747682, అంజిరెడ్డి–7779858789, రమ్య–7702921219, అనుష–9848793357లను సంప్రదించాలని కోరారు. అదనపు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వేమవరపు రామాంజనేయులు పాల్గొన్నారు. రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రోస్టిక్‌ హ్యాండ్‌ ప్రాజెక్ట్‌ వాల్‌పోస్టర్‌ను రెడ్‌క్రాస్‌ ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ ఆవిష్కరించారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా

Advertisement
 
Advertisement
Advertisement