పాఠశాలలను సిద్ధం చేయండి | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలను సిద్ధం చేయండి

Jun 11 2026 7:41 AM | Updated on Jun 11 2026 7:41 AM

పాఠశాలలను సిద్ధం చేయండి

డీఈఓ రామారావు రేపటి నుంచి బడులు పునః ప్రారంభం

నరసరావుపేట ఈస్ట్‌: 2026–27 విద్యా సంవత్సరానికిగాను ఈనెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న దృష్ట్యా పల్నాడు జిల్లా పరిధిలోని పాఠశాలలను సిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు, సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ పి.శ్యాం ప్రసాద్‌ తెలిపారు. డీఈఓ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా పరిధిలోని 1560 ప్రభుత్వ, 454 ప్రైవేటు పాఠశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని వివరించారు. విద్యార్థులకు పంపిణీ చేసేందుకు అవసరమైన పాఠ్యపుస్తకాలు ఇప్పటికే ఆయా మండల కేంద్రాలకు చేరుకున్నాయని, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలను గురువారం నాటికి పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రూ.15 కోట్లతో కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌, మౌళిక సదుపాయాలు లేని పాఠశాలల్లో పనులు చేపట్టినట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వంద రోజుల్లో ఏసీఆర్‌ కార్యక్రమంలో భాగంగా 60 పాఠశాలల్లో 218 తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేయనున్నట్టు తెలిపారు. గత ఏడాది 1వ తరగతిలో 12,000 మంది విద్యార్థులు చేరగా, ప్రస్తుత విద్యా సంవత్సరానికిగాను ఇప్పటికే 10,500 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని, ప్రతి తరగతిలో ప్రవేశాలను పెంచేలా అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగిస్తున్నట్టు వివరించారు. జిల్లా పరిధిలో 484 ప్రాథమిక పాఠశాలలను మోడల్‌ ప్రైమరీ పాఠశాలలుగా గుర్తించామన్నారు. ఆయా పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు రూ.27 కోట్లు నిధులు విడుదల కానున్నట్టు తెలిపారు. దీంతోపాటు 60 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలను మోడల్‌ ప్రాథమిక పాఠశాలలుగా గుర్తించేందుకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. జిల్లాలోని అన్ని వసతి గృహాలలో సదుపాయాలను పరిశీలించి పాఠశాలలు తెరిచే నాటికి వసతి గృహాలను సైతం అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు తొలిరోజు నుంచే చర్యలు తీసుకునేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచనలు ఇచ్చినట్టు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement