పీఆర్‌సీ కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలి తీర్మానం చేసిన అమరావతి జేఏసీ ఉద్యోగుల సంఘం
నరసరావుపేట: ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని అమరావతి జేఏసీ ఉద్యోగుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక కార్యాలయంలో బుధవారం సమావేశమై పలు తీర్మానాలు చేశారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ ఎన్.నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ.. పీఆర్‌సీ కమిషన్ చైర్మన్ 2024లో రాజీనామా చేసినప్పటికీ ఇప్పటివరకు మరొకరిని నియమించకపోవటం తగన్నారు. వేతన సవరణ కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం పక్కనపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులు, గృహ అద్దెలు వంటి జీవన వ్యయాలు విపరీతంగా పెరిగినా వాటికి అనుగుణంగా మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించకపోవటం వలన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇతర పనులతోపాటు రెగ్యులర్ బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తీవ్ర పనిభారం పడుతూ మానసిక ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఈహెచ్‌ఎస్ సమర్థంగా అమలు కావడం లేదని, అనేక వైద్యశాలలు వాటిని అమలు చేయకపోవటంతో ఉద్యోగులు తమ సొంత డబ్బులతో పొందాల్సి వస్తోందన్నారు. పీఆర్‌సీ, ఐఆర్ ప్రకటించి ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని తీర్మానం చేశారు. వెంటనే పీఆర్‌సీ కమిషన్ నియమించాలని, ఉద్యోగులకు తక్షణమే ఐఆర్ ప్రకటించాలని, వేతన సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, ఉద్యోగులపై పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించాలని, ఈహెచ్‌ఎస్ పథకాన్ని సమర్థంగా అమలు చేసి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డిమాండ్ చేశారు. జనరల్ సెక్రటరీ జి.తిరుపతిరావు, వీఆర్‌ఓ అసోసియేషన్ అధ్యక్షుడు రామారావు, జిల్లా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.సురేంద్ర, జిల్లా జేఏసీ మహిళా కార్యదర్శి దివిషా బేగం, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ నాయకులు ఆంజనేయులు, బాబా సాహెబ్ పాల్గొన్నారు.


