వన్‌మంత్..వన్ విలేజ్..ఆరంభంలోనే అపశ్రుతి ముగింపు రోజు రద్దు..రెవెన్యూ కష్టాలు యఽథాతథం కాగితాలకే పరిమితమైన పాలకుల చిత్తశుద్ది
యడ్లపాడు: వందేళ్ల భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష’ పథకం (రీసర్వే)పై అనేక అవాస్తవ ప్రచారాలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నా.. కేవలం పథకాల పేర్లు, నినాదాలు మాత్రమే మారాయి తప్ప సామాన్యుడి సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామంటూ ఎన్నికల ముందునుంచే పాలకులు ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావేదిక, కలెక్టర్ల ఆధ్వర్యంలోని రెవెన్యూ క్లినిక్‌లు, ఎమ్మెల్యేల ప్రజా దర్బార్‌లు.. ఇలా ఊరూరా సభలు నిరంతరాయంగా జరుగుతున్నా, అక్కడ అందుతున్న అర్జీల్లో మూడోంతులకు పైగా శాశ్వత పరిష్కారం దొరకడం లేదన్నది బహిరంగ రహస్యం. సామాన్యుడి రెవెన్యూ కష్టాలు తీర్చి, వివాద రహిత గ్రామాలు నిర్మిస్తామన్న పాలకుల మాటలు కేవలం కాగితాలకే పరిమితం కావడంతో ప్రజల్లో నిరాశ అలుముకుంది.
కంటితుడుపు చర్యలేనా?
తాజాగా కూటమి ప్రభుత్వం దేశంలోనే వినూత్నమని విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రారంభించిన ‘వన్‌మంత్..వన్ విలేజ్..ఫోర్‌విజిట్’ కార్యక్రమం ఆరంభంలోనే అపశ్రుతి పలికింది. మొదటి గురువారం వినతులు, రెండో వారం క్షేత్ర విచారణ, మూడో వారం పరిష్కారం, నాలుగో వారం ముగింపు అంటూ పెట్టిన నిబంధనలు కేవలం కంటితుడుపు చర్యలుగా మిగిలిపోయాయి. మ్యుటేషన్లు, సరిహద్దు వివాదాలు, భూ ఆక్రమణలపై ప్రజలు ఆశగా ఇచ్చిన వినతులు అధికారుల గైర్హాజరీతో బుట్టదాఖలయ్యాయి. విద్యార్థుల సర్టిఫికెట్ల మంజూరు, భూముల కొలతలు తప్ప మిగిలిన కీలక సమస్యలన్నీ యథాతథంగా ఉండిపోయాయి. ఈ గ్రామసభలకు కీలక శాఖల అధికారులు దాదాపుగా డుమ్మా కొట్టారు. ఇందుకు ప్రజావేదిక, ఓటర్ల జాబితా పరిశీలన, జనాభా లెక్కలు, వాటిపై అవగాహనలు, శిక్షణలు రీసర్వే వంటి మల్టిపుల్ టాస్క్‌లు, యాప్‌ల నిర్వహణతో ఇప్పటికే సతమతమవుతున్న అధికారులపై ఈ అదనపు భారం మరింత ఒత్తిడిని పెంచడమే ప్రధాన కారణమని అధికారులు వెల్లడిస్తున్నారు.
లాగిన్ ఇవ్వలేదు.. నాల్గో వారమే రద్దు!
హడావిడిగా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ప్రభుత్వం, అధికారులకు కనీసం ఆన్‌లైన్ లాగిన్ సౌకర్యం కల్పించకపోవడం పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. దీనివల్ల ప్రజలు ఇచ్చిన అర్జీలు ఆన్‌లైన్ కాక.. ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎన్ని పరిష్కారమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లా కార్యాలయాల్లో సైతం ఎలాంటి డేటా లేకపోవడంతో ఇదంతా ఒక గందరగోళ ప్రహసనంగా మారింది. కార్యక్రమం ప్రారంభించిన నాలుగో వారం ప్రజల అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపించాల్సింది పోయి, అదేరోజు కార్యక్రమాన్నే పూర్తిగా రద్దు చేయడం గమనార్హం. దీంతో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సామాన్యుడి ఆశలు అడుగంటుతున్నాయి.
అప్పుడు ‘సక్సెస్’.. ఇప్పుడెండుకు ‘రివర్స్’?
ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లాలో తొలిగా ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేసినప్పుడు విజయవంతమైందని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం దీనిని అమల్లోకి తెచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో సమస్యలు జటిలంగా మారడంతో నిబంధనలను మధ్యలోనే మార్చేస్తూ ప్రభుత్వం కాలయాపన వ్యూహానికి తెరతీసింది. మొదట మండలానికి ఒక గ్రామం అన్న పాలకులు, ఆ తర్వాత నియోజకవర్గానికి ఒకటని, తీరా ఇప్పుడు జిల్లా మొత్తానికి కలిపి కేవలం ఒకే ఒక్క గ్రామానికి పరిమితం చేస్తూ లాగిన్ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో పెదకూరపాడు నియోజకవర్గంలోని ఒకే ఒక్క గ్రామం ఆన్‌న్‌లైన్‌న్‌లో కనిపిస్తుండటం పాలకుల తిరోగమన విధానానికి అద్దం పడుతోంది. ఒక్క పల్నాడు జిల్లాలోనే 364 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇలా ఒక్కో గ్రామానికి నెల రోజుల సమయం వెచ్చిస్తూ పోతే.. వచ్చే ఎన్నికల సమయానికి కూడా ఒక నియోజకవర్గం పూర్తికావడం అసాధ్యం. ఇది ప్రజా సమస్యల పరిష్కారం కోసమా లేక కేవలం ప్రచారం కోసమా? అంటూ ప్రజలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.


