వంటింట్లో గ్యాస్‌ మంట! | - | Sakshi
Sakshi News home page

వంటింట్లో గ్యాస్‌ మంట!

Jun 10 2026 1:31 AM | Updated on Jun 10 2026 1:31 AM

వంటింట్లో గ్యాస్‌ మంట!

డొమెస్టిక్‌ సిలిండర్‌పై రూ.29 పెంపు మార్చి నెలలోనే రూ. 60 వడ్డింపు సామాన్యులపై నానాటికీ పెను భారం మోపుతున్న కూటమి ప్రభుత్వం పెరిగిన ధరలతో బెంబేలెత్తుతున్న పేదలు

కూటమి ప్రభుత్వం ప్రజలపై రోజురోజుకూ పెనుభారం మోపుతోంది. గ్యాస్‌ బండను సామాన్య కుటుంబాలకు గుదిబండగా మార్చేసింది. పెట్రోల్‌, డీజిల్‌ తరహాలోనే గ్యాస్‌ ధర పెరుగుతూనే ఉంది. గతేడాది సిలిండర్‌ పై రూ. 50 పెంచిన ప్రభుత్వం మార్చి నెల 7న ఏకంగా రూ. 60 బాదింది. ప్రస్తుతం మరో రూ. 29 పెంచి సామాన్యుల నడ్డివిరుస్తోంది. సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా దీపావళి పండుగను పురస్కరించుకొని చంద్రబాబు సర్కారు అమల్లోకి తెచ్చిన ఉచిత గ్యాస్‌ అంతా బోగస్‌గా మారింది. వేలాది మంది ఎల్పీజీ వినియోగదారులు నేటికీ ఈ పథకానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత ధర పెంపుతో జిల్లా ప్రజలపై నెలకు ఏకంగా రూ.2.28 కోట్లకుపైగానే అదనపు భారం పడుతోంది.

సత్తెనపల్లి: పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచుతూ గడిచిన రెండు మూడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వాతలు పెడుతూనే ఉంది. ప్రజల ఇబ్బందులు ఏమాత్రం పట్టించుకోకుండా విడతలవారీగా పెంచుకుంటూ పోతోంది. దీనికి కొనసాగింపుగా ఈ వారం ఆరంభంలో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచిన కూటమి ప్రభుత్వం తాజాగా గృహావసరాల వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరనూ భారీగా పెంచింది. దీంతో సామాన్యులు, మధ్యతరగతి, పేద ప్రజలకు మూలిగే నక్కపై తాటిపండు పడినట్టయింది. జిల్లాలో 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2,019.50 ఉండేది. కూటమి ప్రభుత్వం గత నెలలో సిలిండర్‌పై ఒకేసారి ఏకంగా రూ. 993.50 ధర పెంచింది. పెరిగిన ధరలతో జిల్లాలో ఆ గ్యాస్‌ ధర రూ. 3,184 కు చేరింది. ఇక ఈ నెల మొదటి వారంలో మరోసారి వాణిజ్య సిలిండర్‌ ధర రూ.40 వరకూ పెరిగింది. దీంతో సిలిండర్‌ ధర రూ. 3,236 కు చేరింది. ఈ ధరల పెంపు చూసి చిరు వ్యాపారుల నుంచి హోటల్‌ నిర్వాహకుల వరకు బెంబేలెత్తిపోయారు. తాజాగా సిలిండర్‌ మీద రూ. 40 పెంచారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో సిలిండర్‌పై రూ. 1,051 పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పెరిగిన ధర చూసి తాము వ్యాపారాలు చేయలేమని ఆహార ఉత్పత్తులు తయారు చేసేవారు వాపోతున్నారు. పెరిగిన ధరతో వాణిజ్య సిలిండర్లు ఇక పూర్తిగా బ్లాక్‌ కానున్నాయి. జిల్లాలో వాణిజ్య అవసరాలకు సంబంధించి 4 వేల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. ఇదే సమయంలో హోటళ్లు, ఇతర ఆహార పదార్థాల తయారీ వంటి వ్యాపార కేంద్రాలు వేల సంఖ్యలో ఉండటం గమనార్హం. వాణిజ్య సిలిండర్‌ ధర అధికంగా ఉండడంతో 90 శాతం హోటళ్లలో గృహ అవసరాల సిలిండర్లు వినియోగిస్తున్నారు. గృహ అవసరాల సిలిండర్లలోని గ్యాస్‌ను వాణిజ్య అవసరాల సిలిండర్‌లోకి డంప్‌ చేస్తున్నారు. ఈ కనెక్షన్‌ లేకుండా హోటళ్లు నడుపుతున్న వారు నేరుగా గృహ అవసరాల గ్యాస్‌నే వాడుతున్నారు. గ్యాస్‌ కొరతతో, ధర పెంచడంతో చాలా హోటళ్ల వారు కట్టెల పొయ్యిలు వినియోగిస్తున్నారు.

పెను భారం...

జిల్లా వ్యాప్తంగా 51 గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రస్తుతం 14.2 కిలోల వంటింటి గ్యాస్‌ రూ. 954.50 ఉండేది. తాజాగా రూ. 29 పెంచిన ధర ఆదివారం నుంచి అమల్లోకి రావడంతో వినియోగదారులు రూ. 983.50 చెల్లించాల్సి వస్తుంది. జిల్లా వ్యాప్తంగా డొమెస్టిక్‌ కనెక్షన్లు 6,02,997 ఉన్నాయి. దీపం కనెక్షన్లు 1,85,316 కలిపి మొత్తం 7,88,313 కనెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన వినియోగదారుడు నెలకు కనీసం ఒక సిలిండర్‌ వాడినా వాటిపై జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా రూ. 2,28,61,077 అదనంగా భారం పడుతోంది.

అడ్డగోలుగా పెంపు

ఎన్నికల హామీల్లో భాగంగా వంట గ్యాస్‌ ధరలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే 24 నెలల్లో మూడుసార్లు ధరలు పెంచేశారు. మొదటి 10 నెలలకు రూ. 50, ఈ ఏడాది మార్చి 7న సిలిండర్‌పై ఏకంగా రూ. 60, ప్రస్తుతం మరో రూ. 29 పెంచి ధరల వడ్డింపు మొదలెట్టారు. దీంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు అర్హత కలిగిన వారికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇచ్చిన హామీ పథకం ఆదిలోనే అటకెక్కింది.

బడ్జెట్‌ తారుమారు...

గ్యాస్‌, పెట్రోల్‌ , డీజిల్‌ ధరల పెంపుతో ఆ ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార ఉత్పత్తుల సంస్థలపై పడుతోంది. ఈ మూడు, నాలుగు నెలల కాలంలోనే ఆహార పదార్థాల ధరలను హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు పెంచేశాయి. తిరిగి వచ్చి ఈ భారం కూడా ప్రజల మీదే పడుతోంది. ఇలా పెరుగుతున్న చమురు ధరల కారణంగా తమ నెలవారీ బడ్జెట్‌ తలకిందులు కావడంతో ఏం చేయాలని సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement