వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పీఆర్కే వెన్నుపోటు నిరసన కార్యక్రమం విజయవంతం పెద్ద ఎత్తున హాజరైన పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు
మాచర్ల: సీఎం చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, ఎంతో మోసపూరితంగా ఆయన వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట నిరసన కార్యక్రమం మాచర్ల పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఐదు మండలాల నుంచి వందల మంది తరలివచ్చారు. కార్యాలయం వద్ద పోస్టర్లను ప్రదర్శించారు. సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకుండా చంద్రబాబు మోసపూరితంగా వ్యవహరిస్తున్న వైనాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. పార్టీ శ్రేణులతోపాటు రైతులు, యువత, ప్రజలు, మహిళలు.. ఇలా అన్నివర్గాల వారు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల బెలూన్‌లను పీఆర్కే ఆధ్వర్యంలో ఎగురవేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత పీఆర్కే మాట్లాడుతూ.... సీఎం చంద్రబాబు అన్ని వర్గాలను మోసగించేలా రెండేళ్లుగా పాలన చేస్తున్నారన్నారు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1500 ఎగ్గొట్టారని మండిపడ్డారు. రైతులకు చేసిన మేలు మచ్చుకై నా కనిపించడం లేదన్నారు. 50 సంవత్సరాలు దాటిన వారికి పింఛను ఊసే లేదని, రెండేళ్లుగా కొత్త పింఛన్‌లు కూడా లేవని గుర్తుచేశారు. ప్రజల సమస్యలను గాలికి వదిలివేసి హెలికాప్టర్‌లో చక్కర్లు కొడుతూ ఇప్పటికీ గాలి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. రూ. లక్షల కోట్ల అప్పులు చేస్తూ రాష్ట్రంలోని ప్రజలకు ఒక్క రూపాయి కేటాయించడం లేదన్నారు. చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కుమారుడి కోసం, దత్త పుత్రుడి కోసం ఐటీ కంపెనీలతో ఫేక్ ప్రచారం, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ పాలనంతా జగన్ ఫోబియాతోనే చేస్తున్నారన్నారు. నిజాలు మాట్లాడినా, ప్రజలకు మేలు చేయలేదని అడిగినా... అక్రమ కేసులు పెడుతూ అన్ని వర్గాలను పోలీసు స్టేషన్‌కు పిలిపించి రెడ్‌బుక్ రాజ్యాంగంతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాలను నిరసిస్తూ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పోలా శ్రీను, యరబోతుల శ్రీనివాసరావు, బోయ రఘురామిరెడ్డి, కామనబోయిన కోటయ్య, పెద్ద మల్లు స్వామి, నవులూరి భాస్కర్‌రెడ్డి, పోతురెడ్డి కోటిరెడ్డి, షేక్ మస్తాన్, నవులూరి చెన్నారెడ్డి, కొమ్ము చంద్రశేఖర్‌రావు, కొంగర సుబ్రహ్మణ్యం, చిలుకూరి చంద్రశేఖర్‌రెడ్డి, నరసింహరావు, తిప్పారెడ్డి గోపాల్‌రెడ్డి, డి. వెంకటేశ్వర్లు, కొండా శివలింగరాజు, గొట్టం బ్రహ్మారెడ్డి, మందా సంతోష్, మాచర్ల సుందరరావు, గోలి శ్రీనివాసరావు, షేక్ బాజి, ముస్తఫా, రామాంజనేయరెడ్డి, పిల్లి కొండ, మోరా రామకష్ణారెడ్డి, కేతావత్ బాలునాయక్, మాచర్ల పవన్, పాముల సంపూర్ణమ్మ, ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, శివపార్వతి, పులిమెల మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.


