జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: జిల్లాలో నిర్దేశిత గడువులోగా సర్ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)పై మంగళవారం క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సంజన సింహ, ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో సర్ ప్రక్రియను తప్పులు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోని బీఎల్‌ఓలు తప్పనిసరిగా ప్రతి ఇంటిని సందర్శించి, ఓటర్ల వివరాలను సేకరించాలని సూచించారు. వాటిని 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేయాలన్నారు. ఈ అంశంపై బీఎల్‌ఓలు పోలింగ్ కేంద్రాల పరిధిలోని వివిధ పార్టీల బూత్ ఏజెంట్ (బీఎల్‌ఏ)లకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల ఈఆర్‌ఓలు తమ పరిధిలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఈ ప్రక్రియ సజావుగా సాగేలా సహకారం తీసుకోవాలన్నారు. జాబితాలో మార్పుచేర్పులు ఉంటే వాటిని ఆన్‌లైన్‌లో చేసేటప్పుడు తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. బీఎల్‌ఓలకు ఏఈఆర్‌ఓలు సెలవులు మంజూరు చేస్తేనే తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఎలక్షన్ డీటీల వివరాలు కలెక్టర్‌కు అందజేయాలని సూచించారు.


