వాహనదారుడు మృతి
అమరావతి: మండల పరిధిలోని నరుకుళ్లపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. మండలంలోని ధరణికోట గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ హనీఫ్(39) సోమవారం తాడికొండ మండలం లాం గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి సోమవారం అర్థరాత్రి ద్విచక్రవాహనంపై ధరణికోట బయలుదేరాడు. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న హనీఫ్ నరుకుళ్లపాడు వాగు బ్రిడ్జి వద్ద కుక్క అడ్డుగా రావటంతో అదుపు తప్పి వాహనం చింతచెట్టుకు ఢీకొంది. తీవ్రగాయాలై హనీఫ్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న అమరావతి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. మంగళవారం హనీఫ్ మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతునికి భార్య ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
నేడు స్పాట్ కౌన్సెలింగ్
గుంటూరు రూరల్: కాచిపురంలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహా విశ్వవిద్యాలయంలోని వివిధ కోర్సులకు ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి నగరంలోని అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మసీ కళాశాలలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు హిందూ కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు తెలిపారు. మంగళవారం హిందూ ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మతో కలసి కౌన్సిలింగ్ ప్రతులను ఆవిష్కరించారు. రంగరాజు మాట్లాడుతూ ఫీజులో బీఈ విద్యార్థులకు రాయితీ ఉంటుందన్నారు. కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ మహిళలు ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించేందుకు అన్ని రకాల సౌకర్యాలు అందజేస్తున్నామన్నారు. సమావేశంలో ఏఐబీఎఫ్ జాతీయ కార్యదర్శి పాండురంగవిఠల్, కొప్పర్తి సీతారమేష్, మాచిరాజు మురళీకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ నాగభూషణం, సీతారామయ్య పాల్గొన్నారు.
వ్యవసాయ పనిముట్లు దగ్ధం
ఇంకొల్లు(చినగంజాం): చెత్తకు పెట్టిన నిప్పు అంటుకుని ఓ రైతుకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు దగ్ధమై ఆస్తి నష్టం సంభవించిన సంఘటన మండలంలోని గొల్లపాలెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన వెనిగండ్ల చంద్రశేఖర్‌కు చెందిన వ్యవసాయ పనిముట్లు నూతనంగా నిర్మిస్తున్న వైద్యశాల పక్కన ఉంచాడు. అక్కడ ఉన్న చెత్తను శుభ్రం చేసిన పారిశుధ్య కార్మికుడు తగలబెట్టేందుకు నిప్పు అంటించాడు. తీవ్రమైన గాలి ధాటికి మంటలు చెలరేగి చంద్రశేఖర్‌కు చెందిన 200 స్ప్రింక్లర్ పైపులు, నీళ్ల ట్యాంకు, 2 ఫుట్ వాల్వ్‌లు కాలి బూడిదయ్యాయి. ప్రమాదం కారణంగా రూ.2.50 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తహసీల్దార్ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు చెప్పారు.
జాతీయస్థాయి పోటీలకు పలువురి ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ప్రాచీన యుద్ధకళ కర్రసాము పోటీల్లో నగరానికి చెందిన కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని చీఫ్ కోచ్ కాశీనాఽథ్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 7న స్థానిక బీఆర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి కర్ర సాము పోటీల్లో ఎనిమిది మంది విద్యార్థులు బంగారు పతకాలు సాధించి మరోసారి అకాడమీ పేరు నిలబెట్టారన్నారు. ఐదుగురు సిల్వర్, ఒకరు బ్రాంజ్ మెడల్స్ సాధించారన్నారు. ఆయా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈనెల 21న తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో జరిగే జాతీయస్థాయి కరస్రాము పోటీలకు అర్హత సాధించారన్నారు. క్రీడాకారులను ఎస్‌ఐ విజయ్‌కుమార్, సక్సెస్ స్కూల్ డైరెక్టర్ బి.సాయి మల్లికార్జున్, అకాడమీ అధ్యక్షులు వెంకట రమణతోపాటు పలువురు అభినందించారన్నారు.


