మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి శివారులో ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాడపల్లి గ్రామానికి చెందిన బత్తుల ధనుంజయరావు(42), ఉప్పుతల నర్సింహారావు (38) ఇద్దరు గత కొద్ది రోజులుగా సిమెంట్ పరిశ్రమలో లారీలకు సిమెంట్ ఎగుమతి చేసేందుకు వెళ్తుంటారు. రోజుమాదిరిగా మంగళవారం ద్విచక్ర వాహనంపై వారు సిమెంట్ పరిశ్రమకు బయలుదేరారు. గ్రామం నుంచి దామరచర్ల వైపు లారీ యార్డ్ సమీపానికి రాగానే అదే సమయంలో పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి– నారాయణపురం గ్రామానికి చెందిన జెక్క వెంకటేష్(25) దామరచర్ల నుంచి గుంటూరుకు బైక్‌పై రాంగ్‌రూట్‌లో వేగంగా వెళ్తూ ఎదురుగా సిమెంట్ పరిశ్రమకు వస్తున్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో బైక్‌లు నడుపుతున్న ధనుంజయరావు, వెంకటేష్‌లకు తీవ్ర గాయాలుకాగా.. ధనుంజయరావు అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేష్, నర్సింహారావులను 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వెంకటేష్ మృతిచెందాడు. నర్సింహారావు పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడు బత్తుల ధనుంజయరావుకు కుమారుడు, కుమార్తె, భార్య సైదమ్మ ఉన్నారు. ఉప్పుతల నర్సింహారావుకు ఇద్దరు కుమారులు, భార్య అంజమ్మ ఉన్నారు. మరో మృతుడు జెక్క వెంకటేష్ అవివాహితుడు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
నిరుపేద కుటుంబానికి చెందిన వారే..
వాడపల్లికి చెందిన ధనుంజయరావు, ఉప్పుతల నర్సింహారావులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. ఇండియా సిమెంట్ (ఆల్ట్రాటెక్) పరిశ్రమలో దినసరి కార్మికులుగా పనిచేస్తున్నారు. జెక్క వెంకటేష్ కుటుంబం సైతం పేద కుటుంబమే. చిన్నప్పుడే తండ్రి జెక్క శ్రీనివాస్‌రావు ఇద్దరు పిల్లలు, భార్యను వదిలేసి వెళ్లడంతో తల్లి పూలమ్మ పెంచి పెద్ద చేసింది. కుమార్తె పెళ్లి చేయగా కొడుకు చేదోడువాదోడుగా ఉంటూ కుటుంబాన్ని పోషించేందుకు రైల్వే స్టేషన్‌లో వాటర్ బాటిళ్లు, చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. వెంకటేష్ మృతితో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది.


