గుంటూరు ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థలకు డిజిటల్ వ్యూహాలు రూపొందిస్తూ సోషల్ మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సిరాజ్ సేవలను గుర్తిస్తూ ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఐకాన్ ఆఫ్ పొలిటికల్ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్– 2026‘ పురస్కారం ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియన్ ఐకాన్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో సినీ నటి హెబ్బా పటేల్ చేతుల మీదుగా సిరాజ్ పురస్కారాన్ని అందుకున్నారు. మాజీ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ టి.ఎన్. సురేష్ కుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు అవార్డులు ప్రదానం చేశారు.
స్టీలు బ్రిడ్జి పనులు ప్రారంభం
తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజ్ సమీపంలో బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మిస్తున్న స్టీలు బ్రిడ్జి గతంలో స్వల్పంగా ఒరగడంతో ఆ బ్రిడ్జిలో కొంత భాగాన్ని సీఆర్‌డీఏ అధికారుల సూచనల మేరకు తొలగించారు. ఆ గడ్డర్లను సరిచేసి బకింగ్‌హామ్ కెనాల్‌పై అమర్చేందుకు కాంట్రాక్టర్లు మంగళవారం నుంచి పనులు ప్రారంభించారు. మొత్తం నాలుగు ఐరన్ గడ్డర్లు బిగించాల్సి ఉండగా సాయంత్రం సమయానికి మూడు గడ్డర్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. మరో గడ్డర్‌ను అమర్చి దానిపై కాంక్రీట్ వేసేందుకు ప్రత్యేకమైన రేకులు, స్టీలును అమర్చాల్సి ఉంది. 10–15 రోజుల్లో స్టీలు బ్రిడ్జిపై కాంక్రీట్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అక్కడి సిబ్బంది తెలిపారు.
క్రైస్తవ మైనారిటీలపై దాడులను అరికట్టాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్రైస్తవులు ఇతర మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని క్రిస్టియన్ డెమోక్రాటిక్ మూవ్‌మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.ఎ.మెల్కీ సెదేక్, మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో క్రిస్టియన్ డెమోక్రాటిక్ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో మతమార్పిడి నిరోధక చట్టాలు, క్రైస్తవ ఇతర మైనార్టీలపై దాడులకు వ్యతిరేకంగా మంగళవారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హర్షకుమార్. మెల్నీసెదేక్ మాట్లాడుతూ.. దేశంలో తీసుకొచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళిత క్రిస్టియన్ బిల్లును ఆమోదించాలన్నారు.


