వేమూరు: వేమూరు నియోజకవర్గంలో మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. చుండూరు మండలం ఆలపాడు గ్రామంలోని చెరువులో మట్టి తవ్వి అక్రమంగా అమ్ముకుంటున్నారు. తెరవెనుక స్థానిక ప్రజాప్రతినిధి హస్తం ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఆలపాడు చెరువులో తవ్విన మట్టిని పెదపూడి, కూచిపూడి, పెరవలిపాలెం, వలివేరు, అమృతలూరు, మూల్పూరు గ్రామాలకు తరలిస్తున్నారు. మట్టి రవాణాను అడ్డుకుంటే బదిలీ వేటు పడుతుందని అధికారులు భయపడుతున్నారు. చుండూరు మండలం పెదగాదెవలర్రు గ్రామంలో కూడా ఇష్టారాజ్యంగా గుంతలు పెట్టి మట్టి తవ్వకాలు చేయడంతో తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం అడ్డుకుంది. దీంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని తవ్వకాలు నిలిపి వేశారు. అమృతలూరు మండలం మోపర్రు గ్రామంలో చెరువు తవ్వకాల్లో తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల మధ్య విబేధాలు రావడంతో ఒక వర్గం అడ్డుకుంది. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఇరువర్గాలకు చెందిన నాయకులను పిలిచి పంచాయితీ చేశారు. దీంతో మోపర్రులో చెరువు మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఆలపాడులో జనసేన పార్టీకి చెందిన ఓట్లు అధికంగా ఉండటం వల్ల ఆ పార్టీ నాయకులే అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. దీనిపై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ప్రతి చెరువు తవ్వకంలో ఎమ్మెల్యేకు వాటా ఇవ్వాలని ఆ పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు. మండల అధికారులు అక్రమ మట్టి తవ్వకాలు నిలిపి వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.


