కూటమి ప్రభుత్వంలో ప్రజలకు వెన్నుపోటు
రెడ్ బుక్
అమలుకే
ప్రాధాన్యం
సాక్షి, నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లవుతోంది. ఈ సందర్భంగా కూటమి నేతలు భారీఎత్తున సంబరాలకు సిద్ధమయ్యారు. నేడు తిరుపతిలో సంక్షేమం పేరిట విజయోత్సవ సభలకు నాంది పలుకుతున్నారు. అయితే ఇదే సమయంలో రెండేళ్ల కూటమి పాలనలో ఏం సాధించారని పల్నాడు జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అభివృద్ధి లేదని, తామొస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఊరువాడ చెప్పుకొచ్చారు. మరి రెండేళ్లలో జిల్లాలో చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి కార్యక్రమైనా పూర్తి చేశారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించిన సూపర్–6 పథకాలైనా అమలయ్యాయా అంటే అది లేదు. ఈ నేపథ్యంలో ఏం సాధించారని విజయోత్సవ సభలు చేపడుతున్నారంటూ పల్నాడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఏడు దశాబ్దాలుగా పల్నాటి ప్రజల కల వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణం. గతంలో ఎంతో మంది నేతలు అనుకున్నా ప్రాజెక్టుకు అవసరమైన అటవీ, పర్యావరణ, వన్యప్రాణ సంరక్షణ వంటి కీలక అనుమతులను కేంద్రం నుంచి తేవడంలో సఫలీకృతం కాలేకపోయారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరికపూడిశెల ప్రాజెక్టు అనుమతులపై ప్రత్యేక దృష్టిపెట్టి కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధించి కీలక అడుగువేశారు. మొదటి దశ పనులను ప్రారంభించారు. అంతలో ఎన్నికలు రావడంతో పనులకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు చంద్రబాబు మొదలు స్థానిక నేతల వరకు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీలిచ్చారు. అయితే రెండేళ్లైనా కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని ప్రజలు వాపోతున్నారు. ఇంకా అనుమతులంటూ కాలయాపన చేస్తున్నారు. మరోవైపు జలజీవన్‌మిషన్, వైఎస్సార్ కరువునివారణ పథకం వంటి పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండు వసంతాలు గడిచినా జేజేఎం పనులు పూర్తి చేసి ఇంటింటికి తాగునీరు అందించలేకపోతున్నారు. నరసరావుపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు ఇంకా స్థలసేకరణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఎప్పుడో పూర్తికావాల్సిన క్రిటికల్ కేర్ యూనిట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వినుకొండ ట్రామాకేర్ ఏర్పాటు ఎంతో అత్యవసరం దాని ఊసే ప్రస్తుత పాలకులు ఎత్తడం లేదు. సాగర్ కాలువల మరమ్మత్తులు ఇప్పటివరకు చేయలేదు. కీలకమైన జాతీయ రహదారుల పనులు ముందుకుసాగడం లేదు. ముఖ్యంగా నకరికల్లు–వాడరేవు జాతీయ రహదారి భూసేకర నేటికి పూర్తికాలేదు. మాదిపాడు బ్రిడ్జ్ పూర్తి చేయలేదు.
అభివృద్ధి పనులను అటకెక్కించారు.. ఇంటికే అందుతున్న సంక్షేమానికి మంగళం పాడారు.. ఎర్రటి ఎండలో పండుటాకులను ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారు.. రైతులు పెట్టుబడి సాయం లేక.. వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు.. ప్రభుత్వ బడులు మూసేశారు.. పిల్లల్ని ‘ప్రైవేటు’ బాట పట్టించారు. అంతన్నారు.. ఇంతన్నారు.. సూపర్ సిక్స్ అమలులో సూపర్ ప్లాఫ్ అయ్యారు. జిల్లాలో చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి పనీలేదు.. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రారంభించిన వరికపూడిశెల పనులు సైతం పూర్తిచేయలేదు.. పిడుగురాళ్ల మెడికల్ కళాశాల అభివృద్ధి ఊసే లేదు.. రెండేళ్ల కూటమి నేతలు సాధించింది.. కుట్రలు.. కుతంత్రాలు.. ప్రతిపక్ష నేతలకు వేధింపులు.. క్రూరంగా రెడ్‌బుక్
రాజ్యాంగం అమలు మాత్రమేనంటూ జనం పెదవి విరుస్తున్నారు.


