దగా డీఎస్సీగా మార్చారు | - | Sakshi
Sakshi News home page

దగా డీఎస్సీగా మార్చారు

Jun 9 2026 5:48 AM | Updated on Jun 9 2026 5:48 AM

వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద నిరసన

వెంటనే సీబీఐచే విచారణ జరిపించి అభ్యర్థులకు న్యాయం చేయాలి

విద్యాశాఖ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలి

కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేసిన నాయకులు

నరసరావుపేట: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం పోస్టులను అమ్ముకొని దగా డీఎస్సీగా మార్చిందని వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ నాయకులు మండిపడ్డారు. పార్టీ అధీష్టానం పిలుపు మేరకు సోమవారం పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌ వరకు నిరసన ప్రదర్శన చేశారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులు, కార్యకర్తలను ప్రవేశద్వారం వద్ద పోలీసులు, కలెక్టరేట్‌ సిబ్బంది అడ్డుకొని కేవలం కొంతమందినే లోపలికి పంపారు. పీజీఆర్‌ఎస్‌లో దగా డీఎస్సీపై సీబీఐచే విచారణ జరిపించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

సీబీఐతో విచారణ జరిపించాలి

డీఎస్సీపై వచ్చిన వదంతులపై సీబీఐచే విచారణ జరిపించాలని, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కందుల ఎజ్రా మాట్లాడుతూ డీఎస్సీలో అవకవతకలు, అభ్యర్థులకు అన్యాయం ఖచ్చితంగా జరిగిందన్నారు. స్పోర్ట్స్‌ కోటాలో 431పోస్టులను న్యాయంగా భర్తీచేయకుండా తమ వారికి అమ్ముకున్నారన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డీఎస్సీ–98 బ్యాచ్‌కు 4500 మందికి డీఎస్సీ పోస్టులు ఇవ్వటం వలన వారి కుటుంబాలు అంతా చల్లగా ఉన్నాయన్నారు. ఇప్పుడు అభ్యర్థులకు చాలా అన్యాయం జరిగిందన్నారు. జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిలకా జైపాల్‌ మాట్లాడారు. జిల్లా ఉపాధ్యక్షుడు కాలే మాణిక్యాలరావు, రాష్ట్ర సంయుక్త కార్య దర్శి గంటెనపాటి గాబ్రియేలు, జిల్లా ఉపాధ్యక్షులు నెలటూరి సురేష్‌, నరసరావుపేట నియోజకవర్గ ఎస్‌సీ సెల్‌, సోషల్‌మీడియా కన్వీనర్‌ బూదాల కల్యాణ్‌, కుక్కల పౌలయ్య, రొంపిచర్ల మండల ఎస్‌సీ సెల్‌ అధ్యక్షులు గుండాల వెంకటేష్‌ పాల్గొ న్నారు.

అనంతరం కలెక్టర్‌ ముందు పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీలకు రిజర్వేషన్‌ సక్రమంగా అమలుచేయకుండా హారిజంటల్‌ రిజర్వేషన్‌ అనే కొత్తపేరుతో ఎస్సీలకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. జీఓ నంబరు 47 అనే కొత్త ఉత్తర్వులతో రెండుశాతం ఉన్న స్పోర్ట్స్‌ కోటాను మూడు శాతానికి పెంచారన్నారు. నిబంధనలకు విరుద్దంగా మెరిట్‌కు పాతరేసి ఒక్కో పోస్టును రూ.15లక్షల నుంచి రూ.20లక్షలకు అమ్ముకోవటంపై ఆడియో, వీడియాలు బయటపడ్డాయన్నారు. దీనిపై వైఎస్సార్‌ సీపీ ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో ఎటువంటి చలనంలేదన్నారు. నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొలిపే ఉద్దేశ్యంతో ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement