నాలుగు దశాబ్దాలుగా ఆలయంలో అర్చకుల సేవలు అర్చకులకు షోకాజ్ నోటీసులు వివాదాస్పదంగా కమిటీ చైర్మన్ తీరు వంతపాడుతున్న ఆలయ ఈవో దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు తహసీల్దార్ బెదిరింపులపై భక్తుల ఆగ్రహం
నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి ఆలయంలో నాలుగు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న అర్చకస్వాములపై కూటమి ప్రభుత్వ వేధింపుల పట్ల భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. భక్తులు ఎంతో నమ్మకంతో స్వీకరించే కంకణధారణల నుంచి ఆలయ అర్చకులను తప్పించే కుట్రపై మండిపడుతున్నారు. ఆలయ దినదినాభివృద్ధిలో అర్చకస్వాముల కృషిని వారు గుర్తు చేస్తున్నారు. ఆలయ కమిటీ, ఈవో చర్యల పట్ల తీవ్ర నిరసన వ్యకం అవుతుంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉత్తర్వులు పాటించలేదనే నెపంతో ఆలయ అర్చకులపై చర్యలకు ఈవో నలబోతు మాధవిదేవి సిద్ధమవుతుంది. ఈ మేరకు సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. భక్తుల కొంగుబంగారంగా, గ్రామదేవతగా వెలిసిన ఇస్సపాలెంలోని మహంకాళి అమ్మవారి దేవస్థానం ఐదు దశాబ్దాల్లో జిల్లాలోని ప్రముఖ దేవస్థానంగా మారింది. కోరిన కోర్కెలు తీరుతుండటంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరగసాగింది. ఆదాయం పెరగడంతో ఆలయ అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. ఆలయంలో 40 సంవత్సరాలుగా కొత్తలంక సుధాకరశర్మ కుటుంబ సభ్యులు అర్చకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీరి కుమారుడు కార్తీకేయ శర్మ అర్చకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆలయంలో కంకణధారణపై అర్చక కుటుంబంపై ఆలయ కమిటీ, ఈవో వేధింపులకు పాల్పడటం చర్చనీయంగా మారింది.
వివాదాస్పదం కమిటీ చైర్మన్ తీరు
ఆలయ కమిటీ చైర్మన్‌గా బండ్లమూరి చంద్రశేఖర్ వ్యవహార శైలి గతంలోను వివాదాస్పదంగా ఉంది. ఆలయ చైర్మన్‌గా ఆయన తండ్రి రామయ్య వ్యవహరిస్తున్న సమయంలో అక్కడ జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన మీడియాపై వీరు దాడులకు పాల్పడ్డారు. ఈ కేసులో ప్రస్తుత చైర్మన్ చంద్రశేఖర్ జైలుకు వెళ్లి వచ్చాడు. ఈ వ్యవహారానికి కారణం ఆలయ అర్చకులే అని అక్కసు పెంచుకున్న చైర్మన్ ఎలాగైనా వారిని ఆలయం నుంచి బయటకు పంపాలనే కుట్ర చేస్తూ పావులు కదుపుతున్నాడు. కూటమి ప్రభుత్వంలో చైర్మన్‌గా ఎంపికై న నాటి నుంచే ఏకపక్షంగా వ్యవహరిస్తూ అర్చకులపై వేధింపులు ప్రారంభించాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు కంకణదారణను అర్చకుల నుంచి దూరం చేసే కుట్ర చేస్తున్నట్టు తెలుస్తుంది.
తహసీల్దార్ బెదిరింపులపై భక్తుల మండిపాటు
కంకణధారణ వ్యవహారాన్ని వివాదాస్పదంగా మార్చి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయ ఈవో నలబోతు మాధవిదేవి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈఓ భర్త వేణుగోపాల్ ప్రస్తుతం నరసరావుపేట తహసీల్దార్‌గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం ఆలయంలో అర్చకులకు, ఈవో, కమిటీ సభ్యులకు మధ్య జరుగుతున్న వివాదంలో సంబంధం లేకపోయినా ఆయన తలదూర్చడం వివాదాస్పదంగా మారింది. ఆలయ విధుల్లో ఉన్న అర్చకస్వాములపై బెదిరింపు ధోరణిలో తహసీల్దార్ మాట్లాడటం పట్ల భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. మీరు ఎలా ఇక్కడ పనిచేస్తారో చూస్తా అంటూ అర్చకులపై ఆయన బెదిరింపులకు పాల్పడటం భక్తులకు విస్మయానికి గురిచేసింది. ఆలయ వ్యవహరాల్లో ఎటువంటి సంబందం లేని వ్యక్తి ఇక్కడికి వచ్చి ఎలా మాట్లాడుతారని భక్తులు ప్రశ్నించారు. తహసీల్దార్ బెదిరింపులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు భక్తులు తెలిపారు.
అర్చకులకు షోకాజ్ నోటీసులు
ఆదివారం ఆలయంలో చోటుచేసుకున్న ఘటనపై ఆలయ అర్చకులు నండూరి కాళీకృష్ణ, కెఆర్‌విఎస్ కార్తికేయలకు షోకాజ్ నోటీసులు అందజేసినట్టు ఈవో నలబోతు మాధవిదేవి సోమవారం ప్రకటనలో తెలిపారు. కంకణధారణలో ప్రభుత్వ ఉత్తర్వులను అర్చకుల ధిక్కరించారని పేర్కొన్నారు. వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా దేవదాయ శాఖ కమిషనర్‌కు సమగ్ర నివేదిక సమర్పించినట్టు వివరించారు.


