11న ఫుట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక సత్తెనపల్లి: సత్తెనపల్లి సుగాలీ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈ నెల 11న ఉదయం 9.00 గంటలకు సబ్ జూనియర్స్, జూనియర్స్ ఫుట్‌బాల్ జిల్లా జట్ల ఎంపికలు జరుగుతాయని పల్నాడు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. సుబ్రహ్మణ్యేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు సబ్ జూనియర్ కేటగిరి 2013 జనవరి 01 నుండి 2014 డిసెంబర్ 31 మధ్య జన్మించిన వారు అర్హులన్నారు. జూనియర్స్ కేటగిరిలో 2011 జనవరి 01 నుండి 2012 డిసెంబర్ 31 మధ్య జన్మించిన వారు అర్హులన్నారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు తమ ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, నాలుగు పాస్‌ఫోర్ట్ సైజ్ ఫొటోలు, తల్లిదండ్రుల సమ్మతి పత్రం తీసుకొని రావాలన్నారు. ఆయా పత్రాలు తప్పనిసరిగా తీసుకొని రావాలని, ఏ ఒక్క పత్రం లేకపోయినా ఎంపికకు అనుమతి ఉండదన్నారు. మరిన్ని వివరాలకు 73969 67776 సెల్ నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు. జాతీయ స్థాయి కరాటే పోటీలలో టిష్యంత్ ప్రతిభ సత్తెనపల్లి: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన బొల్లేపల్లి టిష్యంత్ ప్రతిభ చూపాడు. ఈనెల 4 నుంచి 7 వరకు డెహ్రాడూన్‌లో కరాటే ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో బాలుర అండర్–10 సబ్ జూనియర్ కటా విభాగంలో సత్తెనపల్లికి చెందిన ఏవీఆర్ కరాటే అకాడమీ విద్యార్థి బొల్లెపల్లి టీష్యంత్ ఆంధ్రప్రదేశ్‌కి ప్రాతినిధ్యం వహించి తను పోటీపడిన విభాగంలో ఇతర రాష్ట్రాల విద్యార్థులను ఓడించి బ్రాంజ్ మెడల్ కై వసం చేసుకున్నాడు. బొల్లేపల్లి టిష్యంత్ సాధించిన ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్ కరాటే ఆర్గనైజేషన్ సెక్రటరీ కీర్తన కొండ్రు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సత్తెనపల్లికి జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్టలు సంపాదించి పెట్టినటువంటి టిష్యంత్‌ను ఆర్గనైజర్ అనుముల వీర బ్రహ్మం, సెన్ సాయ్ అనుమల రాంబాబు, కరాటే మాస్టర్ అనుమల రామయ్యలు సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. పిడుగుపాటుకు రెండు పాడిగేదెలు మృతి విప్పర్ల(క్రోసూరు): మండలంలోని విప్పర్ల గ్రామ రైతు చెరుకూరి కృష్ణయ్యకు చెందిన రెండు పాడి గేదెలు సోమవారం వేకువజామున పిడుగు పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు.. ప్రతిరోజూ విప్పర్ల గ్రామం నుంచి అందుకూరు గ్రామం వైపు యథావిధిగా వెళ్లి వస్తుంటాయన్నారు. ఉదయం రాకపోవటంతో వెతుకులాడినట్లు తెలిపారు. దీంతో అందుకూరు గ్రామ హద్దుల్లో మృతి చెంది పడి ఉన్నాయని, పరిశీలించగా పిడుగుపాటుకు మృతి చెందినట్లు గుర్తించామన్నారు. మండల పశువైద్యుడు షేక్ బషీర్‌కు సమాచారం అందించారు. గ్రామ వీఆర్వో సికా కోటయ్యతో కలిసి వచ్చి సంఘటనా స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించినట్లు తెలిపారు. రెండు పాడిగేదెల విలువ సుమారు రూ.1.80 లక్షలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఆటోలో ప్రయాణిస్తున్న 11 మందికి గాయాలు
నరసరావుపేట టౌన్: ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన సోమవారం పట్టణ శివారులో చోటుచేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరంగిపురం మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన మేరీ సుశీల, రామారావు, సౌరమ్మ, సలోమి, ఆంథోనమ్మ, వేలంగిణి రాణి లతో పాటు మరో ఐదుగురు ఆటోలో రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో బంధువులు చనిపోతే చూసేందుకు వెళ్లారు. తిరిగి సాయంత్రం స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. నరసరావుపేట శివారు గుంటూరు రోడ్డు ఆర్‌కే రెస్టారెంట్ సమీపంలో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. సంఘటనలో పై ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఈఎంటీ వెంకట చెన్నయ్య, పైలెట్ సాయిరామ్‌లు క్షతగాత్రులను ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.