డీఈఓపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

డీఈఓపై చర్యలు తీసుకోవాలి

Jun 9 2026 5:42 AM | Updated on Jun 9 2026 5:42 AM

నరసరావుపేట: మెరిట్‌కు అన్యాయం చేస్తున్న పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌ సంజనా సింహకు ఏపీ గిరిజన సంఘం, మాల మహానాడు, పీడీఎం, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌, బీసీ సంక్షేమ సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ ప్రజా సంఘాలు వినతిపత్రం అందజేశాయి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో (సమగ్ర శిక్ష) ఖాళీగా ఉన్న జీసీడీఓ, ఏఎల్‌ఎస్‌సీఓ పోస్టులు డిప్యూటేషన్‌పై భర్తీకి ఏప్రిల్‌ నెలలో నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు. ఆ పోస్టులకు సంబంధించి మెరిట్‌ లిస్టులు మే ఒకటిన సిద్ధమైనప్పటికీ డీఇఓ నిబంధనలకు విరుద్ధంగా అర్హతలేని అభ్యర్థులకు అదనపు మార్కులు కలపాలనే దుర్బుద్ధితో మెరిట్‌ లిస్టులను కలెక్టర్‌ కార్యాలయానికి పంపకుండా ఆపేశారన్నారు. పది రోజుల తరువాత డిఇఓ తను నిర్ణయించుకున్న అభ్యర్థులకు అర్హత లేకున్నా కమిటీపై ఒత్తిడి తెచ్చి అదనపు మార్కులు కలిపారన్నారు. డీఇఓ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ పారదర్శకంగా జరిగే అవకాశం లేనందున కలెక్టర్‌ జోక్యం చేసుకుని ఇంటర్వ్యూని పారదర్శకంగా జరిపి మెరిట్‌ను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అలా కాకుండా మెరిట్‌కు అన్యాయం జరిగితే తదుపరి చర్యలు చేపడతామని హెచ్చరించారు. పీడీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అర్హులైన మెరిట్‌ ఉన్న ఉపాధ్యాయులకు ఈ పోస్టులు ఇవ్వాలని అలాకాని పక్షాన డీఈఓను సస్పెండ్‌ చేసే వరకు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ గతంలో కూడా డీఈఓపై అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇప్పటికై నా విద్యాశాఖాధికారిపై చర్యలు తీసుకోకపోతే విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్‌, గిరిజన సంఘ ఉపాధ్యక్షులు వాంకడోత్‌ కోటా నాయక్‌, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్‌పాల్‌, పీడీఎం సీనియర్‌ నాయకులు నల్లపాటి రామారావు, బీసీ సంఘం నాయకులు బిళ్లగంటి శ్రీను, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ కోటా సాయికుమార్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మేకపోతుల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

జాయింట్‌ కలెక్టర్‌కు ప్రజాసంఘాల వినతి

Advertisement
 
Advertisement
Advertisement