ఆడబిడ్డలకూ వెన్నుపోటే! | - | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డలకూ వెన్నుపోటే!

Jun 8 2026 6:48 AM | Updated on Jun 8 2026 6:48 AM

ఆడబిడ్డలకూ వెన్నుపోటే! జిల్లాలో రూ. వేల కోట్ల బకాయిలు... గతంలో జీవనోపాధికి అండగా...

అటకెక్కిన సూపర్‌ సిక్స్‌ హామీలు...

రెండు సంవత్సరాలైనా అమలుకు నోచుకోని ‘ఆడబిడ్డ నిధి’ పథకం

సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 18 నుంచి 59 ఏళ్లలోపు వయసు మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు రూ. 1,500 నేరుగా ఖాతాలో జమ చేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రతి బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఆ మాటలు నమ్మి చాలామంది ఓటేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయినప్పటికీ ఆడబిడ్డ నిధి పథకం అమలుపై నోరు మెదపడం లేదు. ఇటీవల జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లోగానీ, మంత్రివర్గ భేటీలోగానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ పథకం గురించి చర్చకు రాలేదు. అంటే ఈ పథకం కూడా గాలిలో కలిసినట్లేనా? అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయకుండా కొత్తగా ముగ్గురు పిల్లల్ని కనండి, నలుగురు పిల్లల్ని కనండని సీఎం చంద్రబాబు ఇస్తున్న ఉచిత సలహాలపై మహిళా లోకం భగ్గుమంటోంది.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి రూ. 18 వేలు ఆర్థిక సహాయం అందజేయాలి. ఈ పథకం కోసం జిల్లాలోని మహిళలందరూ ఎదురుచూస్తుండగా ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలోని 7,80,538 మంది మహిళలకు నెలకు రూ. 117.08 కోట్లు బకాయి పడింది. రెండేళ్లలో ఒక్కో మహిళకు రూ. 36 వేలు చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని వారికి ఇలా మొత్తం రూ. 2,810 కోట్లు అందజేయాల్సి ఉంది. ఈ నగదు ఎప్పుడు చెల్లిస్తారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించడంతో పాటు రాబోయే రోజుల్లో ప్రతి నెలా రూ. 1500 చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మహిళల జీవనోపాధికి పెద్దపీట వేసింది. అమ్మ ఒడి, వైఎస్సార్‌ ఆసరా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, సున్నా వడ్డీ, వైఎస్సార్‌ చేయూత వంటి ముఖ్యమైన పథకాలన్నింటినీ నేరుగా మహిళల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేసి వారి ఆర్థిక అభివృద్ధికి అండగా నిలిచింది. మహిళల చేతికి చేరిన నగదు వృథా కాకుండా ఇంటి అవసరాలకే ఉపయోగపడుతుందని భావించి అనేక పథకాల డబ్బును మహిళల ఖాతాకే జమ చేసింది.

ఇప్పటికే ఒక్కో మహిళకు రూ.36 వేల వరకు చంద్రబాబు ప్రభుత్వం బకాయి

రెండేళ్లలో జిల్లా అతివలకు

చెల్లించాల్సిన మొత్తం రూ.2,810 కోట్లు

ఎన్నికల హామీలు ఎగ్గొట్టేందుకు

టీడీపీ సర్కార్‌ ఎత్తుగడలు

సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేశాం.. ఇంకెవరైనా అమలు చేయలేదంటే వారి నాలుక మందమే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ సభలో అన్నారు. తీరా చూస్తే మసిపూసి మారేడు కాయ చేసి ఇచ్చాం అన్నట్లు ఉంది ఆయన ప్రభుత్వం తీరు. కుట్రలో భాగంగా పీ4 పథకంలో ఆడబిడ్డ నిధిని చేర్చి ఇక అన్నీ ఇచ్చేశాం అన్నట్లు కవర్‌ చేసి చంద్రబాబు మహిళలకు శఠగోపం పెట్టారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని మరిచిపోయేలా చేసేందుకు ఇప్పుడు కొత్తగా పిల్లల్ని కనడంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని మహిళలు విమర్శిస్తున్నారు.

అరచేతిలో వైకుంఠం చూపించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మరోమారు రుజువైంది. ఎన్నికల ముందు ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్తగా ముగ్గురు పిల్లలను కంటే రూ. 30 వేలు, నలుగురు పిల్లలను కంటే రూ. 40 వేలు మహిళలకు ఇస్తామంటూ చంద్రబాబు చేసిన ప్రకటన చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలను పెంచడానికే ఆ తల్లిదండ్రులు నానా యాతన పడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజలను డైవర్ట్‌ చేసేందుకే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను మరువలేదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని ప్రజలు హితవు పలుకుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement