● విలువిద్యలో సత్తా చాటుతున్న
నరసరావుపేట బాలుడు
● చిన్న వయస్సులోనే జాతీయ,
అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ
నరసరావుపేట: విలువిద్య (ఆర్చరీ) పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నరసరావుపేటకు చెందిన 13 ఏళ్ల బాలుడు మాలపాటి మారుతీ ఆరుష్‌రెడ్డి సత్తా చాటుతున్నాడు. గత మే నెల గోవాలో నిర్వహించిన ఒకటో ఆల్ ఇండియా ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్‌లో రెండు రజతాలు, మూడు, తొమ్మిదో ర్యాంకులు సాధించాడు.
చిన్నానాటి నుంచే విజయాలు...
డాక్టర్ మాలపాటి చెంచిరెడ్డి, డాక్టర్ శాంతిశ్రీలకు 2013 మే 23న జన్మించిన ఆరుష్‌రెడ్డి చిన్న వయస్సులోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చాడు.
● మూడేళ్ల వయస్సులోనే విజయవాడ ఓల్గా ఆర్చరీ అకాడమీలో చేరటం ద్వారా విలువిద్యలో అడుగుపెట్టాడు. దేశం, విదేశాల్లో 17 పోటీల్లో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.
● 2017 ఆగస్టు 15న రోటరీక్లబ్ ఆఫ్ విజయవాడ నిర్వహించిన అండర్–9 విభాగ పోటీల్లో ప్రథమ స్థానం పొందాడు.
● 2018 మే 20న రికర్వ విభాగంలో 15 మీటర్ల దూరం నుంచి 122 సెం.మీ. లక్ష్యంపై 14 నిమిషాల 40 సెకన్లలో 118 బాణాలు సంధించి అత్యంత పిన్నవయస్కుడిగా ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎక్కాడు.
● అక్టోబరులో రికర్వ్ బాలుర అండర్–9 మినీ నేషనల్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం, నవంబరు 2019 చైనా మకావులో నిర్వహించిన వరల్డ్ ఆర్చరీ ఇండోర్ యూత్ పోటీల్లో 12 మీటర్ల దూరంలో 40 సెం.మీ. లక్ష్యంపై జరిగిన అండర్–12 రికర్వ బాలుర విభాగంలో 17వ స్థానం పొందాడు.
● 2022 మే నెలలో ఏపీలో జరిగిన 12వ మినీ, నాలుగో కిడ్స్ అంతర్ జిల్లా రాష్ట్ర స్థాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ప్రథమ స్థానం పొందాడు.
● ఎన్‌టీపీసీ జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ రౌండ్, మిక్స్‌డ్ టీమ్, 10 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు, 15 మీటర్లు, ర్యాంకింగ్ రౌండ్ విభాగాల్లో రజత పతకాలు సాధించాడు.
● 2024 నవంబరులో గుజరాత్‌లో నిర్వహించిన 68వ జాతీయ పాఠశాల క్రీడల్లో ఏపీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి జట్టు కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
● గుజరాత్‌లో జరిగిన 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీల్లో కాంస్య పతకం పొందాడు.
● 2025 మార్చిలో గుంటూరులో నిర్వహించిన 14వ ఎన్‌టీపీసీ జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీల్లో మిక్స్‌డ్ టీమ్ విభాగంలో స్వర్ణపతకం, వ్యక్తిగత ఎలిమినేషన్ రౌండ్‌లో కాంస్య పతకం పొందాడు.
మరిన్ని పతకాలే లక్ష్యం
ఆరుష్‌రెడ్డి మాట్లాడుతూ... భవిష్యత్తులో దేశం తరఫున అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలనేది తన ఆశయమని చెప్పాడు.
ఈ సందర్భంగా ఆరుష్ తాను సాధించిన పతకాలు, షీల్డులను ప్రదర్శించాడు. ఆదివారం స్థానిక డాక్టర్ రామలింగారెడ్డి మాక్సివిజన్ కంటి వైద్యశాలలో నిర్వహించిన సమావేశంలో ఏపీ ఆర్చరీ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి, ప్రధాన కోచ్ చెరుకూరి సత్యనారాయణ, ఆరుష్ తాత, అమ్మమ్మలు డాక్టర్ ఏఏవీ రామలింగారెడ్డి, డాక్టర్ పమ్మి సరస్వతి తదితరులు చిన్నారిని అభినందించారు.


