నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేట మున్సిపల్ పట్టణ జనాభా దాదాపు 1.40 లక్షలుగా తేలింది. 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం ఈ సంఖ్య 1.17 లక్షలు మాత్రమే. గత 15 ఏళ్లలో పెరిగింది కేవలం 25 వేల జనాభా మాత్రమేనని విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ 15 ఏళ్లలో పట్టణ జనాభా 1.60 లక్షల వరకు ఉంటుందని ఊహించిన అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. గత నెల నుంచి చేపట్టిన జనాభా గణనలో భాగంగా ఇళ్ల గణన కార్యక్రమం సోమవారం ఎనిమిదో తేదీతో ముగియనుంది. వాస్తవానికి ఈ కార్యక్రమం మే 31వ తేదీతో ముగియాలి. మరో వారం పొడిగించారు. మే 31వ తేదీతోనే దాదాపుగా పట్టణంలో ఇళ్ల గణన ముగించారు. అక్కడక్కడ తాళాలు వేసిన ఇళ్లు, ఖాళీగా ఉన్న వాటిని మరోసారి లెక్కిస్తున్నారు. పురపాలకసంఘ పరిధిలోని 38 వార్డులను 365 బ్లాకులుగా విభజించి 190 మంది సచివాలయ ఉద్యోగులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. పట్టణానికి నాలుగువైపులా ఉన్న ఇసప్పాలెం, లింగంగుంట్ల, యల్లమంద, కేసానుపల్లి, రావిపాడు గ్రామాల పరిధిలోని 4,458 గృహాలతోపాటు పట్టణంలో ఇప్పటికే ఉన్న 28 వేలకుపైగా అసెస్‌మెంట్లలోని గృహాలను గణించగా ఈ జనాభా లెక్క తేలింది. పురపాలక పరిధిలో భూమి రేటు పెరిగిపోవటంతో భరించలేని చాలామంది పంచాయతీల్లో కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకోవటం, లేదా రియల్టర్లు కట్టించిన ఇళ్లను కొనుగోలు చేసి అక్కడే ఉండటం చేస్తున్నారు. దీని వలన జనాభా సంఖ్య అనుకున్నంతగా పెరగలేదు.
నేటితో ముగియనున్న ఇళ్ల గణన


