మంగళగిరి టౌన్: తాళం వేసిన ఇంట్లో దొంగలు చొరబడి భారీ సొత్తును అపహరించుకుపోయిన ఘటన మంగళగిరి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామ పరిధిలోని రామాలయం సమీపంలో సుబ్బారావు, వెంకటేశ్వరమ్మ దంపతులు తమ కుమారుడు, కోడలితో కలసి నివాసముంటున్నారు. సుబ్బారావు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమారుడు నవీన్ ఓ ప్రభుత్వరంగ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో సుబ్బారావు తన భార్య వెంకటేశ్వరమ్మతో కలసి పెనుగంచి ప్రోలులోని ఓ కార్యక్రమానికి వెళ్లాడు. కుమారుడు నవీన్ కూడా అదే గ్రామంలోని అత్తగారింటికి వెళ్లాడు. అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల విలువైన వెండి వస్తువులతో పాటు, రూ.లక్ష నగదు దోచుకు వెళ్లినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో కుమారుడు నవీన్ ఇంటికి వచ్చి, లోపల డోర్‌కు వేసిన తాళాలు పగలకొట్టి ఉండడంతో గదిలోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగలకొట్టి ఉండడం గమనించాడు. మరో గదిలో గడ్డపలుగు ఉండడంతో గుర్తుతెలియని దుండగులు ఇంటి వెనుక గోడ దూకి వచ్చి గడ్డపలుగు సాయంతో తాళాలు పగలకొట్టి చోరీకి పాల్పడినట్లు భావించి, పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. మంగళగిరి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌టీమ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
రూ.7 లక్షల విలువైన ఆభరణాలు, రూ.లక్ష నగదు మాయం


