సత్తెనపల్లి: రగ్బీ రాష్ట్ర స్థాయి అండర్–18 జూనియర్ బాల, బాలికల చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచి చాంపియన్‌లుగా శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల జట్లు నిలిచాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న రగ్బీ రాష్ట్ర స్థాయి అండర్–18 బాల,బాలికల జూనియర్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. బాలుర విభాగంలో శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానాన్ని, నెల్లూరు జిల్లా ద్వితీయ స్థానాన్ని, ప్రకాశం జిల్లా తృతీయ స్థానాన్ని దక్కించుకున్నాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని తూర్పు గోదావరి జిల్లా, ద్వితీయ స్థానాన్ని ఆతిధ్య పల్నాడు జిల్లా, తృతీయ స్థానాన్ని గుంటూరు జిల్లా కై వసం చేసుకున్నాయి. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యుడు చదలవాడ అరవిందబాబు హాజరై విజేతలకు రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ కార్యదర్శి బి.రామాంజనేయులుతో కలిసి బహుమతులు అందజేశారు. ఇండియన్ రగ్బీ క్రీడాకారిణి ఎన్‌ఎస్ అక్షయను సన్మా నించారు. పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఇ.కృష్ణారెడ్డి పి.డానియల్, వివిధ జిల్లాల కోచ్‌లు, మేనేజర్లు, టెక్నికల్ అధికారులు, పీడీలు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.


