యడ్లపాడు: చారిత్రాత్మక కొండవీడు కోటలో మరో శాసనం బయటపడినట్లు కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి తెలిపారు. 42 కొండల సమాహారమైన కొండలలో అతి ఎత్తైన రుద్రపాద శిఖరం సమీపంలో ఈ శాసనం బయటపడిందన్నారు. ముస్లిం రాజుల పాలన కాలంలో ఈ శిఖరాన్ని ఆదం షఫీ బోడు అని పిలిచేవారన్నారు. ఈ శిఖరంపై రెడ్డిరాజులు 14, 15 శతాబ్దాల్లో నిర్మించిన రెండు శివాలయాలు, ఆ తర్వాతి ముస్లిం రాజుల కాలంలో నిర్మించిన దర్గా ఉండటంతో హిందువులతో పాటూ ముస్లింలు కూడా వెళ్లి అక్కడ పూజలు, ప్రార్థనలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇదే ప్రాంతంలో గతంలో పలు శాసనాలు బయటపడ్డాయన్నారు. తాజాగా బయటపడిన శాసనాన్ని మైసూర్‌లోని పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం పరిశీలనకు పంపగా, ఇది దాన శాసనంగా గుర్తించారు. శాసనంలో వివరాల మేరకు, భట్లకు నాలుగు వృత్తులు, విరుపాక్ష దీక్షితులకు రెండు వృత్తులు ధారబోసినట్లు రాసి ఉంది. శ్రీ కై లాస శివాయ నమః అని రాసి ఉంది. ఈ శాసనాన్ని పర్వతం ఔభళ పంచారామలు రాసినట్లు ఉంది. కొండవీడు చరిత్ర తెలుసుకునేందుకు ఎన్నో శాసనాలు ఉన్నాయని, భవిష్యత్ తరాలకు రెడ్డి రాజుల చరిత్ర తెలుసుకునేందుకు ఇవి ఉపకరిస్తాయని పేర్కొన్నారు.


