న్యాయవాది హత్య కేసులో వీడిన మిస్టరీ | - | Sakshi
Sakshi News home page

న్యాయవాది హత్య కేసులో వీడిన మిస్టరీ

Jun 7 2026 7:54 AM | Updated on Jun 7 2026 7:54 AM

న్యాయవాది హత్య కేసులో వీడిన మిస్టరీ

భార్యే కీలక నిందితురాలు వివాహేతర సంబంధం, ఇన్స్యూరెన్స్‌ డబ్బుల నేపథ్యంలో హత్య నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు

గాయాలపై అనుమానంతో..

చిలకలూరిపేట: సంచలనం సృష్టించిన న్యాయవాది హత్య కేసులో కీలక నిందితురాలు అతని భార్యేనని తేలింది. వివాహేతర సంబంధం, ఇన్స్యూరెన్స్‌ డబ్బుల కోసమే ఈ హత్య జరినట్లు పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. చిలకలూరిపేట రూరల్‌ పోలీసుస్టేషన్‌లో శనివారం నిర్వ హించిన విలేకర్ల సమావేశంలో రూరల్‌ సీఐ బి.సుబ్బానాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామానికి చెందిన శ్రీరామ హరిప్రసాద్‌(37) ఒంగోలులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తుంటాడు. ఇతనికి భార్య నాగజ్యోతి, ఏడేళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. హరిప్రసాద్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ పదో తేదీన చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామ సమీపంలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది.

కేసు నేపథ్యం...

హరిప్రసాద్‌ భార్య నాగజ్యోతికి వివాహానికి ముందు నుంచే బాపట్ల జిల్లా బల్లికురవ గ్రామానికి చెందిన ఉసర్తి వెంకటకోటయ్యతో వివాహేతర సంబంధం ఉంది. వివాహం తర్వాత కూడా వీరు తమ సంబంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో తన భర్త హరిప్రసాద్‌ ప్రతి రోజూ మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని నాగజ్యోతి తన ప్రియుడు కోటయ్యకు చెప్పింది. హరిప్రసాద్‌ను అడ్డుతప్పిస్తే తాము కలసి హాయిగా జీవించవచ్చని ఇరువురు కలసి పథకం రూపొందించారు. ముందస్తు పథకంలో భాగంగా హరిప్రసాద్‌తో సఖ్యతగా ఉంటూ అతని పేరిట ఇన్స్యూరెన్స్‌ చేయించారు. నామినీగా భార్య నాగజ్యోతి పేరు పెట్టారు.

మిత్రుడి సహకారంతో...

హరిప్రసాద్‌ను హత్య చేసేందుకు వెంకటకోటయ్య తన మిత్రుడైన వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన కొండారెడ్డి శ్రీనివాసరావు సహాయం తీసుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ తొమ్మిదో తేదీన నరసరావుపేట ప్రాంతానికి హరిప్రసాద్‌ను పిలిపించి రాత్రి కలసి మద్యం సేవించారు. అనంతరం ఏప్రిల్‌ పదో తేదీ తెల్లవారు జామున యడవల్లి గ్రామ సమీపంలో కాలకృత్యాల కోసం అంటూ ప్రయాణిస్తున్న స్కూటీని ఆపారు. హరిప్రసాద్‌ కిందకు దిగగానే వెంకటకోటయ్య సైగ చేయడంతో శ్రీనివాసరావు ఇనుప రాడ్‌తో హరిప్రసాద్‌ తలపై బలంగా కొట్టాడు. వెంకటకోటయ్య కూడా ఇనుప రాడ్‌తో విచక్షణారహితంగా దాడి చేయడంతో హరిప్రసాద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృత దేహాన్ని రోడ్డు పక్క లోతట్టు ప్రాంతంలో పడవేసి అతని స్కూటీని కూడా అతనిపై పడవేసి నిందితులు పరారయ్యారు.

రోడ్డు పక్కన లభ్యమైన మృత దేహంపై ఉన్న గాయాలను బట్టి పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి విచారణ నిర్వహించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఏప్రిల్‌ 12వ తేదీన నిందితుడు ఉసర్తి వెంకటకోటయ్య, కొండారెడ్డి శ్రీనివాసరావును అరెస్టు చేసి అదే రోజు రిమాండ్‌కు తరలించారు. అనంతరం కేసును లోతుగా విచారించగా న్యాయవాది హత్యకేసులో అతని భార్య నాగజ్యోతి కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. శనివారం ఆమెను అరెస్టు చేసి ఆమె వాడుతున్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో రూరల్‌ ఎస్‌ఐ జి.అనిల్‌కుమార్‌, ఎస్‌ఐ లేఖా ప్రియాంక, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement