శిక్షణ పూర్తిచేసుకున్న ట్రైనీ ఐపీఎస్‌ | - | Sakshi
Sakshi News home page

శిక్షణ పూర్తిచేసుకున్న ట్రైనీ ఐపీఎస్‌

Jun 7 2026 7:54 AM | Updated on Jun 7 2026 7:54 AM

శిక్షణ పూర్తిచేసుకున్న ట్రైనీ ఐపీఎస్‌ లారీ ఢీకొని వ్యక్తి మృతి ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

నాదెండ్ల: నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌లో మూడు నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్‌ జె. నిరంజన్‌ శుక్రవారం రిలీవ్‌ అయ్యారు. ఆయన్ను నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు, రూరల్‌ సీఐ సుబ్బనాయుడు, ఎస్‌ఐలు ఆర్‌.వెంకటేశ్వరరావు, అనిల్‌కుమార్‌, శివరామకృష్ణ సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ, పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల సమస్యల పరిష్కారం పట్ల అంకితభావం ఉండాలన్నారు.

రొంపిచర్ల: మండలంలోని సుబ్బయ్యపాలెం గ్రామ సమీపంలో శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన పేరం రాందాస్‌(55) మృతి చెందాడు. రాందాస్‌ రోడ్డు పక్కన నిలబడి ఉండగా అదే మార్గంలో వస్తున్న లారీ రాందాస్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాందాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు రాందాస్‌ను హూటాహుటినా నరసరావుపేట వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రొంపిచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. రాందాస్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు రూరల్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈనెలలో ప్రారంభం కానున్న ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ మణి తెలిపారు. సేంద్రియ వ్యవసాయం, మిద్దెతోటల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం వంటి కోర్సులకు 8 వారాలపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తారన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒకొక్క కోర్సుకు రూ.1500 చొప్పున ఫీజు చెల్లించి ఈనెల 20వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ సదుపాయం కంప్యూటర్‌, లేదా ఆండ్రాయిడ్‌ ఫోన్‌, ఐపాడ్‌ వంటివి కలిగి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను కానీ 9441355595, 7036689346, 8096085560 సెల్‌ నంబర్లను ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఏడు గంటలలోపు మాత్రమే సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement