వినుకొండ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై టీడీపీ నాయకులు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ముస్లిం మైనారిటీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే, పీఏసీ సభ్యులు హఫీజ్‌ఖాన్ అన్నారు. వినుకొండలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాదులో ప్రభుత్వ భూమి కొనుగోలు చేశారని అక్రమంగా కేసులో ఇరికించి అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. తన సమీప బంధువు బొల్లా రమేష్ భూమి కొనుగోలు చేశారని, ఇంకా భూమి రిజిస్ట్రేషన్ కాలేదని, అగ్రిమెంట్ కోసం కొంత డబ్బు బొల్లా బ్యాంక్ ఖాతా నుంచి జమ చేశారని చెప్పారు. అసలు దోషులను వదలిపెట్టి కావాలనే రాజకీయ కుట్రతో బొల్లాను అరెస్ట్ చేశారన్నారు. వినుకొండ అభివృద్ధికి బొల్లా చేసిన కృషి ప్రజలందరికీ తెలుసన్నారు. ఆయనకు, ఆయన కుటుంబానికి పార్టీ అన్నీ విధాలుగా అండగా ఉంటుదని భరోసా ఇచ్చారు. రానున్న రోజుల్లో అంతా మంచే జరుగుతుందని అన్నారు. సమావేశంలో జిల్లా మైనారిటీ అధ్యక్షులు పి.ఎస్‌ఖాన్, ఖాదర్‌బాషా, అమీర్, రఫీ, జహంగీర్, మస్తాన్, యాసిన్, జమీర్, ఫక్రుద్దీన్ బాషా తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్


