దశలవారీగా అందరికీ వర్తింపు
రీచార్జ్ చేయకపోతే విద్యుత్ సరఫరా ఆటోమేటిక్‌గా నిలుపుదల
త్వరలో వాణిజ్య, గృహ విద్యుత్
కనెక్షన్లకూ వర్తింపు
నాడు ‘పగలగొట్టండి’ అని చంద్రబాబు, లోకేష్ పిలుపు
నేడు అదే మీటర్లు బిగించి ప్రజలపై పెను ఆర్థిక భారం
జిల్లాలో 246 మంది విద్యుత్ మీటర్ రీడర్ల జీవనోపాధిపైనా దెబ్బ
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీ–పెయిడ్ విద్యుత్ బిల్లింగ్ ప్రారంభం
సత్తెనపల్లి: మొబైల్ ఫోన్ల తరహాలోనే విద్యుత్ వినియోగంలోనూ ‘ప్రీ–పెయిడ్’ విధానం అమల్లోకి వచ్చింది. ఫోన్‌లో బ్యాలెన్స్ అయిపోతే అవుట్ గోయింగ్ కాల్స్ ఎలా కట్ అవుతాయో.. ఇకపై విద్యుత్ మీటర్లలోనూ రీచార్జ్ గడువు ముగిస్తే ఆటోమేటిక్‌గా కరెంట్ కట్ అయిపోనుంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ సరికొత్త ప్రీ–పెయిడ్ బిల్లింగ్ విధానాన్ని ప్రభుత్వ కార్యాలయాల సర్వీసులకు ఏపీసీపీడీసీఎల్ అమల్లోకి తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, వీధి దీపాలు, తాగు నీటి పథకాలకు సంబంధించి మొత్తం 10,812 విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. నెలకు రూ. 5.86 కోట్లు డిమాండ్ ఉంది. మెరుగైన విద్యుత్ సరఫరా, బిల్లింగ్‌లో పారదర్శకత కోసమే ఈ స్మార్ట్ మీటర్లు అమర్చినట్లు అధికారులు చెబుతున్నారు.
మాన్యువల్ మీటర్లను చూసి ఇంతకు మునుపు రీడింగ్ నమోదు చేసేవారు. తర్వాత ఐఆర్‌డీఏ అంటే స్కాన్ చేస్తే రీడింగ్ ఆటోమేటిక్ రికార్డు అవుతుంది. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు తర్వాత ప్రీ–పెయిడ్‌గా మారనున్నాయి. వీటిని ముందుగానే రీచార్జ్ చేసుకోవాలి. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఏ విధంగా చూసుకుంటామో ... ఇక్కడా అదే విధంగా యాప్‌లో చెక్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ ఉన్నంత వరకే విద్యుత్ సరఫరా ఉంటుంది. నగదు అయిపోయిన వెంటనే సరఫరా ఆగుతుంది. రీచార్జ్ చేస్తేనే విద్యుత్ వెలుగులు ఉంటాయి. విద్యుత్ చౌర్యం పెరిగే అవకాశం ఉంది. లైన్ల నుంచి విద్యుత్‌ను అక్రమంగా వాడుకునే వారి సంఖ్య పెరగొచ్చనేది నిపుణుల అభిప్రాయం.
2024 ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్‌లు ‘బాదుడే బాదుడు’ పేరుతో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా .. ‘స్మార్ట్ మీటర్లతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి.. విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్లు బిగిస్తే నిర్భయంగా పగలగొట్టండి’ అని పదేపదే పిలుపునిచ్చారు. కానీ, అదే టీడీపీ అధికారంలోకి రాగానే మాట మార్చి స్మార్ట్ మీటర్ల విధానాన్ని వేగంగా అమలు చేస్తోంది. ఈ విధానం వల్ల ముందుగా డబ్బు కట్టి ఈ–వాలెట్ ద్వారా రీచార్జ్ చేసుకుంటేనే కరెంటు ఉంటుంది.
విద్యుత్ వినియోగదారులపై
మరో పెను ఆర్థికభారం వేయడానికి
చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే స్మార్ట్ మీటర్ల రూపంలో అడ్డగోలుగా బిల్లులు
పెరిగాయని సామాన్యులు వాపోతున్నారు. దీనికితోడు ప్రీ–పెయిడ్ విధానం తీసుకొచ్చేందుకు శరవేగంగా
టీడీపీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. అందులో
భాగంగా ప్రభుత్వ కార్యాలయాలకు తొలుత ఈ కొత్త విధానం వర్తింపచేయాలని నిర్ణయించింది.
ముందుగా డబ్బు కడితే ఆ మేరకు విద్యుత్
సరఫరా జరగనుంది. బ్యాలెన్స్ అయిపోగానే చీకట్లో మగ్గాల్సిందే. ఈ విధానంపై
సామాన్యుల నుంచి ఆందోళన
వ్యక్తమవుతోంది.
ఏడాది క్రితమే అన్ని రకాల సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చారు. ఇప్పటి వరకు మీటర్ రీడింగ్ చూసి, వాడిన యూనిట్ల ఆధారంగా నెలవారీ బిల్లింగ్ చేసేవాళ్లు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ వర్క్స్, వీధి దీపాల సింగిల్ ఫేజ్, త్రీఫేజ్ సర్వీసులను కొన్ని గ్రూపులుగా విభజించి ఈ–వాలెట్‌తో రీచార్జ్ చేసుకునే అవకాశం కల్పించారు. నెలవారీ బిల్లింగ్ ఆధారంగా విద్యుత్ చార్జీలు, స్థిర చార్జీలు, అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల 5వ తేదీన ఈ వివరాలను విద్యుత్ శాఖ ఆర్థిక శాఖకు సమర్పిస్తుంది. దాని ఆధారంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ప్రభుత్వ సర్వీసులకు ఈ విధానాన్ని ప్రారంభించినా ... త్వరలోనే వాణిజ్య (కమర్షియల్), గృహ (డొమెస్టిక్) వినియోగదారులకూ ప్రీ–పెయిడ్ కరెంటు సర్వీసులు వర్తింపచేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్మార్ట్ మీటర్లు బిగించినప్పటి నుంచి సాధారణ బిల్లింగ్ పద్ధతిలోనే బిల్లులు తడిసి మోపెడవుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. భవిష్యత్తులో అడ్వాన్స్ కడితేనే కరెంటు ఉంటుందనే వార్తలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విద్యుత్ శాఖపై ఆధారపడి కొన్నేళ్లుగా జిల్లాలో పని చేస్తున్న 246 మంది విద్యుత్ మీటర్ రీడర్ల జీవనోపాధి కూడా ఈ విధానం వల్ల దెబ్బతినే ప్రమాదం ఉంది.


