ఎల్‌నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు పడకుంటే పరిస్థితి అధ్వానం
ఖరీఫ్ సాగు చేయాలంటే డెల్టా ప్రాంత అన్నదాతలకు కష్టాలే
ఇప్పటికే ప్రాజెక్టులో తగ్గుముఖం పట్టిన నీటి నిల్వ
తీవ్ర ఆందోళనలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు రైతులు
వర్షాలు తగ్గే అవకాశం
అచ్చంపేట: పల్నాడు జిల్లా, అచ్చంపేట మండల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 32 టీంసీలకు చేరింది. ఈ ఏడాది ఎల్‌నివో ప్రభావం వల్ల వర్షాలు తగ్గి తీవ్ర సంక్షోభం ఏర్పడే పరిస్థితులున్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఖరీఫ్ పంటకాలం ప్రారంభమైతే కృష్ణా, డెల్టా ప్రాంతాల ఆయకట్టుకు రోజుకు 10 వేల క్యూసెక్కుల నీటిని వదలాల్సి ఉంటుంది. ఖరీఫ్ పంటకాలం ఎంతో దూరంలో లేదు. జూన్ రెండవ వారం నుంచే ప్రారంభం కావాలి. వర్షాలు ఆలస్యమైతే కనీసం జూన్ చివరివారం, జూలై మొదటి వారంలోనైనా ఖరీఫ్ పంట కాలం ప్రారంభమవుతుంది. ఈలోపు వర్షాలు లేకపోతే ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న 32 టీఎంసీల నీటి నిల్వలు క్రమంగా తగ్గి రెండు, మూడు నెలలలోనే డెడ్ స్టోరేజీకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం రెండు పంటలు పండించుకుంటున్న కృష్ణా, డైల్టా ప్రాంతాలకు చెందిన 13 లక్షల ఎకరాల ఆయకట్టు భూముల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది తలుచుకుంటేనే అన్నదాత వెన్నులో వణుకు పుడుతోంది. మళ్లీ 2019 ముందు పరిస్థితులు పునరావృతం అవుతాయన్న భయపడుతున్నారు.
ఏటా సక్రమంగా నిండినా...
వర్షాలు లేకపోతే ఎగువ శ్రీశైలం, నాగార్జున సాగర్, కృష్ణానదీ పరివాహక ప్రాంతా నుంచి నీళ్లు వచ్చి ప్రాజెక్టులో చేరే అవకాశాలు తగ్గిపోతాయి. ఇప్పటికే ఆయా ప్రాజెక్టులలో కూడా నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. మళ్లీ ప్రాజెక్టులు నిండాలంటే భారీ వర్షాలు కురవాలి. నిన్న మొన్నటివరకు జూన్ మొదటి వారంలో రుతుపవనాలు వస్తున్నాయి, వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు రుతుపవనాలు వెనుక్కు పోయాయంటున్నారు. జలయజ్జం పథకంలో భాగంగా 13 లక్షల ఎకరాల కృష్ణా, డెల్టా ఆయకట్టు భూములకు నీరు అందించే లక్ష్యంతో 2004లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ చేశారు. 2009లో మహానేత మృతితో నిర్మాణ పనులలో తీవ్ర జాప్యం జరిగింది. 2013 నుంచి ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టా ప్రాంతాలకు సాగునీరు విడుదల చేశారు. అయితే 2019 వరకు వర్షాలు సక్రమంగా లేకపోవడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటిని నిల్వ సాధ్యం కాలేదు. 2019 ఖరీఫ్ సీజన్ అంటే జూన్ నుంచే భారీ వర్షాలు కురవడం, ఎగువ నాగార్జునసాగర్ నుంచి వరద రావడంతో 2019 నుంచి గత ఏడాది వరకు ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతూ వచ్చారు. వేసవిలో వర్షాలు లేకపోయిన సాగు, తాగు నీటి కోసం కొంత మేర వదలడంతో ప్రాజెక్టులో నిల్వ తగ్గినా తిరిగి జూన్, జూలై, ఆగస్టు మాసాలలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టు నిండుతూనే ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన రైతుల్లో నెలకొంది.
సంక్షోభాన్ని ఎదుర్కొనేదెలా?
డైవర్షన్ రాజకీయాలను పక్కనబెట్టి, పొగడ్తలతో పొంగిపోవడాలు, ప్రధాన ప్రతిపక్షాన్ని తిట్టించడాలు వంటి లాంటి చర్యలకు టీడీపీ ప్రభుత్వం స్వస్తి పలకాల్సి ఉందని రైతుల సంఘాల నేతలు, అన్నదాతలు పేర్కొంటున్నారు. అన్నీ చేసేశాం అనే భ్రమను వీడి, అన్నదాతలను ఆదుకోవాలనే అంశంపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. వచ్చే సంక్షోభాన్ని ఎలా ప్రతిఘటించాలనే అంశంపై దృష్టి సారించాలని, ఏం చేస్తే రైతులకు మేలు చేకూరుతుందో ఆలోచించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి ఏర్పడవచ్చని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదే జరిగితే ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుతుంది. ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తిగా తగ్గితే కృష్ణా, డెల్టా రైతాంగం పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశాలున్నాయి. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరితే భూగర్భ జలాలు అడుగంటుతాయి. ఇప్పటికే ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న అచ్చంపేట, బెల్లంకొండ మండలాలలో భూగర్భ జలాలు అడుగంటాయి. ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ అయితే 500 అడుగులలో బోరు వేసిన చుక్కనీరు పడే అవకాశాలుండవు. దీనివల్ల కృష్ణా డెల్టా ప్రాంత రైతులకే కాకుండా పెదకూరపాడు నియోజకవర్గంలోని భూములకు సాగునీటి కష్టాలు తప్పవు. కృష్ణానదిలో నీటి మట్టం తగ్గిపోతే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, రక్షిత మంచి నీటి పథకాలు పనిచేయవు.


