నరసరావుపేట: అభివృద్ధిపై చర్చ జరిగితే తమ బండారం బయటపడుతుందనే భయంతో టీడీపీ నేతలు పోలీసు అస్త్రాన్ని ప్రయోగించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు సవాల్‌కు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమైన వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిని పోలీసులు అష్ట దిగ్బంధం చేశారు. డీఎస్‌పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది గురువారం సాయంత్రం నుంచే డాక్టర్ గోపిరెడ్డి ఇంటి పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చర్చా కార్యక్రమానికి అనుమతులు లేనందున పాల్గొనవద్దంటూ పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులకు ముందస్తు నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కోటప్పకొండ వద్ద చర్చకు రావాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో గోపిరెడ్డికి సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, తానొక్కడినే వస్తానని డాక్టర్ గోపిరెడ్డి ప్రకటించారు.
మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద బారికేడ్లు
ఈ మేరకు శుక్రవారం ఉదయం నుంచే ఇరువురు నేతల పార్టీ కార్యాలయాల వద్ద నాయకులు, కార్యకర్తల హడావుడి మొదలైంది. పోలీసులు గుంటూరు రోడ్డులో డాక్టర్ గోపిరెడ్డి ఇంటివైపునకు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇంటి వెనుకవైపు వీధిలో సైతం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోటప్పకొండ వద్ద తాను అన్నీ ఏర్పాట్లు చేశానని, వచ్చేందుకు డాక్టర్ గోపిరెడ్డి భయపడుతున్నారంటూ మీడియాతో ఎమ్మెల్యే అరవిందబాబు చెప్పడం గమనార్హం. దీంతో డాక్టర్ గోపిరెడ్డి 11 గంటల సమయంలో పోలీసు వలయాన్ని ఛేదించుకుని బయటకు వచ్చారు. ప్రత్యేక బలగాలతో కలసి డాక్టర్ గోపిరెడ్డి, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. డాక్టర్ చదలవాడ కూడా తన కార్యాలయం నుంచి బయటకు రావటంతో పోలీసులు నిలువరించారు. ఇరువురు నాయకులతో రూరల్ సీఐ ఎంవీ సుబ్బారావు, సీఐ అచ్చయ్య, ఎస్‌ఐలు చర్చలు జరిపారు. ఉన్నతాధికారులు అనుమతులు ఇవ్వనందున చర్చ ప్రయత్నం విరమించుకోవాలన్నారు. పలువురు వైఎస్సార్ సీపీ నేతలకు ముందస్తు నోటీసులు ఇవ్వడంతోపాటు హౌస్ అరెస్టు కూడా చేశారు.


