ప్రకృతితో కలసి జీవించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రకృతితో కలసి జీవించాలి

Jun 6 2026 1:47 AM | Updated on Jun 6 2026 1:47 AM

ప్రకృతితో కలసి జీవించాలి పోలీస్‌ సంక్షేమానికి తొలి ప్రాధాన్యం

గుంటూరు లీగల్‌: భూమీద అన్ని జీవ రాశులతో కలిసి జీవించే విధంగా మానవాళి మనుగడ ఉండాలని ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి షేక్‌ సికిందర్‌బాషా అన్నారు. ప్రకృతితో కలిసి జీవించాలని తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సమన్యయంతో ఫ్యామిలీ కోర్టు జడ్జి, ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి షేక్‌ సికిందర్‌ బాషా ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. నాల్గవ అదనపు సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌) గుంటూరు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి సెక్రటరీ సి.రమణారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై పిల్లలకు అవగాహన పెంచాలన్నారు. ముందు తరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. పర్మినెంట్‌ లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ పి.ఆర్‌.రాజీవ్‌ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ వాడకాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇన్‌చార్జి పీపీ ఎం.సురేష్‌బాబు, ప్యానల్‌ అడ్వకేట్‌ కట్టా కాళిదాస్‌లు మాట్లాడుతూ ప్లాస్టిక్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఇంటికొక చెట్టు పెంచితే పర్యావరణ కాలుషాన్ని తగ్గించవచని అన్నారు. కార్యక్రమంలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెనన్స్‌ కౌన్సిల్స్‌ స్టాఫ్‌, ప్యానెల్‌ అడ్వకేట్స్‌, పారా లీగల్‌ వాలంటీర్స్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు, ప్రభుత్వ న్యాయవాది ఎం.సురేష్‌బాబు, మొహమద్‌ నజీనా బేగం పాల్గొన్నారు. లీగల్‌ వాలంటీర్లు, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీర్‌, ఏ.పి.పొల్యూషన్‌ బోర్డు, ఉద్యోగులు కోర్ట్‌ ప్రాగణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు.

నగరంపాలెం: విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, సమయపాలనతో ప్రజలకు ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం పోలీస్‌ గ్రీవెన్‌న్స్‌ డే నిర్వహించారు. జిల్లాలోని పోలీస్‌ సిబ్బంది వ్యక్తిగత, సర్వీస్‌, బదిలీలు, ఉద్యోగోన్నతులు, సెలవులపై వినతులను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌కు అందించారు. జిల్లా ఎస్పీ ప్రతి వినతిపత్రాన్ని పరిశీలించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రీవెన్స్‌కి సంబంధించి అర్జీలను పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ఖాళీలు, పారదర్శక విధానాలను పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేస్తామని తెలిపారు. పోలీస్‌ శాఖ ఒక కుటుంబమని, పరస్పర గౌరవం, సహకారంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. పోలీస్‌ సంక్షేమానికి తొలి ప్రాధాన్యమిస్తామన్నారు.

పాఠశాలలను నెట్‌ జీరోలుగా తీర్చిదిద్దాలి

నరసరావుపేట రూరల్‌: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లాలోని విద్యాసంస్థలను నెట్‌ జీరో, శూన్య వ్యర్థాల పాఠశాలలుగా తీర్చిదిద్దాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సంజనా సింహ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్దతురకపాలెంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో సంజనా సింహ మాట్లాడుతూ నెట్‌ జీరో సాధన దిశగా అన్ని పాఠశాలల్లో విద్యుత్‌ వినియోగాన్ని క్రమబద్దీకరించుకోవాలన్నారు. హరిత ఇంధన వినియోగ పద్ధతులను అలవర్చుకోవాలని సూచించారు. పాఠశాల ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement