వైఎస్సార్‌ సీపీ దాచేపల్లి, పిడుగురాళ్ల పలు విభాగాల కమిటీలు నియామకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ దాచేపల్లి, పిడుగురాళ్ల పలు విభాగాల కమిటీలు నియామకం

Jun 6 2026 1:47 AM | Updated on Jun 6 2026 1:47 AM

వైఎస్సార్‌ సీపీ దాచేపల్లి, పిడుగురాళ్ల పలు విభాగాల కమిటీలు నియామకం ‘పది’ షార్ట్‌ మార్క్స్‌ మెమోల డౌన్‌లోడ్‌ గడువు పెంపు రైతుబజార్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి పెట్రోల్‌ పోసుకుని వ్యక్తి బలవన్మరణం

పార్టీ మైనార్టీసెల్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నాసర్‌సైదా

నరసరావుపేట: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర మైనార్టీసెల్‌ సంయుక్త కార్యదర్శిగా గురజాలకు చెందిన షేక్‌ నాసర్‌సైదాను నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 13మందితో దాచేపల్లి నగర పంచాయతీ ఎస్‌సీ సెల్‌ కమిటీ, 14మందితో దాచేపల్లి మండల క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ కమిటీ, 17మందితో పిడుగురాళ్ల మున్సిపల్‌ యూత్‌ వింగ్‌ కమిటీ, మరో 17మందితో పిడుగురాళ్ల మున్సిపల్‌ బీసీ సెల్‌ కమిటీని నియమించారు. అలాగే 20మందితో పిడుగురాళ్ల మున్సిపల్‌ బూత్‌ కమిటీల వింగ్‌ కమిటీ, 17మందితో పిడుగురాళ్ల వైఎస్సార్‌టీయూసీ కమిటీ, 21మందితో పిడుగురాళ్ల మున్సిపల్‌ క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ కమిటీ, మరో 14మందితో పిడుగురాళ్ల మున్సిపల్‌ ఎస్‌టీ సెల్‌ కమిటీని నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు

నరసరావుపేట ఈస్ట్‌: పల్నాడు జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్యాలలో పని చేస్తున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల లాగిన్‌లో ఉన్న 10వ తరగతి పరీక్షల షార్ట్‌ మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని ఈనెల 10వ తేదీ వరకు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు శుక్రవారం తెలిపారు. ఈమేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కె.వి.శ్రీనివాసులరెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. ప్రధానోపాధ్యాయులు షార్ట్‌ మెమోలను డౌన్‌లోడ్‌ చేసి సంతకం, పాఠశాల సీల్‌తో విద్యార్థులకు అందించాలని తెలిపారు. విద్యార్థుల వ్యక్తిగత వివరాలలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే ఈనెల 10వ తేదీ వరకు సవరించుకునే అవకాశం ఉన్నందున ప్రధానోపాధ్యాయులు భవిష్యత్తులో పొరపాట్లకు తావు లేకుండా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈమేరకు జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈఓలు చర్యలు తీసుకోవాలని సూచించారు.

చిలకలూరిపేటటౌన్‌:

అనుమానాస్పదంగా గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. అర్బన్‌ పోలీసులు తెలిపిన సమాచారం మేరకు..పట్టణంలోని ఎన్‌ఆర్‌టీ సెంటర్లోని రైతు బజార్‌ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సదరు విషయాన్ని అర్బన్‌ పోలీసులకు సమాచారం అందించారు. అర్బన్‌ ఎస్‌ఐ సోమేశ్వరరావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విచారణ చేయగా మృతుని వివరాలు లభ్యం కాలేదు. మృతుడు తెల్లచొక్కా, జీన్స్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నాడని..మృతుని ఆచూకీ తెలిసిన వారు వెంటనే పట్టణ పోలీస్‌స్టేషనకు సమాచారం తెలియజేయాలని కోరారు.

చిలకలూరిపేటటౌన్‌: తీవ్ర అనారోగ్య సమస్యలతో పట్టపగలే ఇంట్లోనే ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన శుక్రవారం మండలంలోని మురికిపూడి గ్రామంలో చోటుచేసుకుంది. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్‌ జానీబాషా(42)కు దిల్‌షాద్‌తో 20 ఏళ్ల క్రితం వివాహం కాగా, వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త గ్రామంలోనే చికెన్‌ షాపు నిర్వహిస్తుండగా, భార్య దిల్‌షాద్‌ యడ్లపాడు మండలం తిమ్మాపురంలోని వసంత నూలుమిల్లులో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జానీబాషా ఇటీవల పక్షవాతం బారినపడ్డాడు. అనారోగ్య సమస్యలో లేక మానసిక వేదనో కారణాలు తెలీదుగాని శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో బాత్రూమ్‌లోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. మంట బాధకు తాళలేక పెద్దగా కేకలు వేయడంతో చిన్నకుమార్తె గమనించి స్థానికుల సహాయంతో 108 వాహనంలో తండ్రిని చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రికి తరలించింది. కుమార్తె ఫిర్యాదుతో రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement